● మున్సిపల్ చైర్‌పర్సన్ వర్సెస్ ఏఎంసీ చైర్‌పర్సన్
సిరిసిల్ల అర్బన్: మున్సిపల్ పరిధిలోని పెద్దూరు, రగుడు, సర్ధాపూర్ గ్రామాల్లో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఇద్దరు చైర్‌పర్సన్ల మధ్య బుధవారం ఘర్షణ వాతావరనం చోటుచేసుకుంది. పెద్దూరులో స్థానిక కౌన్సిలర్ లింగంపల్లి భాగ్యలక్ష్మి రాక ముందే కేంద్రాన్ని ప్రారంభించారు. మున్సిపల్ పరిధిలోని మెప్మా ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఇటు మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ, అటు మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ వెలుముల స్వరూపరెడ్డి చేరుకున్నారు. పెద్దూరు, సర్ధాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇద్దరి మధ్య రసాభాస చోటుచేసుకుంది. చివరికి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ స్వరూపరెడ్డి ప్రారంభించారు. ఈ విషయం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. మెప్మా ఆధ్వర్యంలో మున్సిపల్ వారికే బాధ్యత ఉంటుందని అధికారులు పేర్కొనడం విశేషం. మెప్మా ఏవో ఫసహత్ అలీ బేగ్, నాయకులు తిరుపతిరెడ్డి, అశోక్‌రావు, రెడ్డినాయక్, నక్క నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.


