భైంసాటౌన్/ఎల్లారెడ్డిపేట: నిర్మల్ జిల్లా భైంసా పట్టణానికి చెందిన వైద్యుడు, నర్సాపూర్(జి) ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ జీడి సురేందర్(50) బుధవారం గుండెపోటుతో మృతిచెందారు. బైంసాలోని తన ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం ఓ రోగికి వైద్యసేవలు అందిస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది నిర్మల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు.
పేద కుటుంబం నుంచి..
రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్‌దాస్‌పేటకు చెందిన జీడి సాయిలు, పోశవ్వ దంపతుల కుమారుడు జీడి సురేందర్. పదో తరగతి వరకు స్థానిక జెడ్పీ పాఠశాల, ఇంటర్ సిరిసిల్లలో, కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. డిగ్రీ చదువుతుండగానే వెటర్నరీ శాఖలో ఉద్యోగం పొందారు. అనంతరం వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. 2011లో భైంసాలోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా విధుల్లో చేరారు. అప్పటి నుంచి ఎంతో మంది పేదలకు వైద్యసేవలందించారు. సాధారణ రైతు కుటుంబం నుంచి కష్టపడి చదివిన సురేందర్ ఎల్లారెడ్డిపేట నుంచి మొట్టమొదటి డాక్టర్‌గా పట్టా అందుకున్నారు. బైంసా ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తూ ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు. ఎంతోమంది పేదలకు ఉచితంగా వైద్యం అందించే పేదల డాక్టర్‌గా పేరు గడించారు. సురేందర్‌కు భార్య జ్యోతి, ఇద్దరు కూతుళ్లు ప్రీతి, అవంతిక. ఒకరు హైదరాబాద్‌లో మెడిసిన్ చదువుతుండగా, చిన్న కూతురు పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. డాక్టర్ హఠాన్మరణంపై పట్టణ ప్రముఖులతోపాటు వైద్యులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.


