ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): రైతులకు మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ అన్నారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్, రాచర్ల గొల్లపల్లి బుగ్గరాయేశ్వర తండాలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. ధాన్యం అమ్మిన రైతులకు డబ్బులు నేరుగా వారి ఖాతాలోనే వారం రోజుల్లో జమ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుజాత, ఏఎంసీ చైర్మన్ సబేరాబేగం, ప్రత్యేక అధికారి షఫీ, ఏఎంసీ వైస్ చైర్మన్ గుండాడి రామ్‌రెడ్డి, సర్పంచులు ఇల్లందుల గీతాంజలి, అజ్మీరా తిరుపతినాయక్, అందే సుభాష్, కొండ రమేశ్‌గౌడ్, నాయకులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారమే లక్ష్యం
తంగళ్లపల్లి(సిరిసిల్ల): విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారమే లక్ష్యమని ఎస్‌ఈ టి.వేణుమాధవ్ అన్నారు. మంగళవారం మండలంలోని అంకిరెడ్డిపల్లిలో నిర్వహించిన ‘ప్రజా బాట’ కార్యక్రమంలో వినియోగదారుల సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో వోల్టేజీ సమస్య తలెత్తకుండా కొత్త ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు, ప్రమాదకరంగా వేలాడుతున్న లూజ్ లైన్లు సరిదిద్దడం, స్తంభాల ఏర్పాటుపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. యూనిఫాం సర్వీస్ లైన్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు. విద్యుత్ వినియోగంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు స్వయంగా ప్రయత్నించకుండా వెంటనే సిబ్బందికి సమాచారం అందించాలని కోరారు. ఆపరేషన్ డీఈ అంజయ్య, ఏడీఈ గోపీనాథ్, ఏఈ మధుకర్, సర్పంచ్ రాగుల రాజిరెడ్డి, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
ప్రభుత్వంలో విలీనం చేయాలి
సిరిసిల్లటౌన్: ఆర్టీసీ సిబ్బందికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని జేఏసీ చైర్మన్ బాణయ్య కోరారు. రాష్ట్ర కమిటీ సమ్మె సన్నాహక పిలుపులో భాగంగా మంగళవారం సిరిసిల్ల డిపో ఎదుట ధర్నా నిర్వహించి మాట్లాడారు. ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేసి ప్రభుత్వ ఉద్యోగుల బెనిఫిట్స్ అందించాలని కోరారు. జేఏసీ వైస్ చైర్మన్లు జేఎస్‌ఎన్ రావు, బి. శ్రీనివాస్, కన్వీనర్ రమేశ్, గ్యారేజ్ కో కన్వీనర్ మల్లేశం, నాగసాగర్, భూమయ్య, మల్లయ్య, సత్తయ్య, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగులు స్వయం ఉపాధి సాధించాలి
సిరిసిల్ల: జిల్లాలో నిరుద్యోగులు స్వయం ఉపాధి సాధించి, ఆర్థికంగా నిలదొక్కుకోవాలని జిల్లా పరిశ్రమలశాఖ జనరల్ మేనేజర్ టి.హనుమంతు కోరారు. కలెక్టరేట్‌లోని జిల్లా పరిశ్రమల కేంద్రంలో మంగళవారం నిరుద్యోగ యువకులు, మహిళా సంఘాలకు, ఆసక్తి గల వ్యాపారులకు స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. ప్రధాన మంత్రి ఎంప్లాయిమెంట్ జననేషన్ (పీఎంఈజీపీ) పథకంలో తయారీ రంగానికి రూ.50 లక్షలు, సేవల రంగానికి రూ.20 లక్షలు, రూ.10లక్షల వరకు ఎలాంటి ష్యూరిటీ లేకుండా రుణవసతి ఉందన్నారు. ఇందులో 15 నుంచి 35 శాతం మేరకు సబ్సిడీ ఉందన్నారు. పీఎంఎఫ్‌ఎంఈ (ఫుడ్ ప్రాసెసింగ్) యూనిట్లకు వ్యక్తిగతంగా రూ.10లక్షలు, ఎస్‌హెచ్‌జీ గ్రూపులకు రూ.3కోట్ల వరకు రుణ వసతి ఉందని, ఇందులో 35 శాతం సబ్సిడీ వస్తుందన్నారు. ఆసక్తి గల వారు జిల్లా పరిశ్రమల కేంద్రాన్ని సంప్రదించాలని కోరారు.


