● వేములవాడ కో ఆప్షన్ ఎన్నికలకు నేడు చివరి గడువు
వేములవాడ: వేములవాడ మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక నామినేషన్లకు గడువు 22వ తేదీతో ముగియనుండగా, ఇప్పటి వరకు కేవలం నాలుగు నామినేషన్‌లు మాత్రమే దాఖలయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన చీకోటి శ్రీహరి, తోట లహరి, అబ్దుల్ రజాక్, నామాల వరలక్ష్మి నామినేషన్లు దాఖలు చేసినట్లు మేనేజర్ సంపత్ తెలిపారు. బుధవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు వేసే అవకాశం ఉంది.
నలుగురికి ఆప్షన్
వేములవాడ మున్సిపాలిటీలో మొత్తం నాలుగు కో ఆప్షన్ పోస్టుల్లో రెండు మైనార్టీలకు, రెండు స్పెషల్ నాలెడ్జ్ పర్సన్స్‌కు కేటాయించిన విషయం తెలిసిందే. ఆశావహులు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ఎవరి పేరును ఫైనల్ చేయాలన్న దానిపై అధికార పార్టీ ఇంకా స్పష్టతకు రాలేదు. అయితే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎవరికి ఆప్షన్ ఇస్తారనే అంశంపై సందిగ్ధం నెలకొంది.
విప్ బిజీ.. నిర్ణయం పెండింగ్
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో తుది నిర్ణయం పార్టీ నేతల చేతుల్లోనే ఉంది. ముఖ్యంగా విప్ ఆది శ్రీనివాస్ బిజీ షెడ్యూల్ కారణంగా అభ్యర్థుల ఎంపికపై ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని సమాచారం. దీంతో ఆశావహులు ‘చివరి నిమిషం’ వరకు వేచి చూసే పరిస్థితి ఏర్పడింది. మంగళ, బుధవారాల్లో వీటిని ఫైనల్ చేసే అవకాశాలున్నాయని పాలకవర్గ సభ్యులు అంటున్నారు.
లాబీయింగ్ జోరు
ఇప్పటికే ఆశావహులు పార్టీ ముఖ్య నేతలతో సంప్రదింపులు ముమ్మరం చేశారు. మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నాయకుల ద్వారా తమ పేర్లు ముందుకు తెచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. చివరి రోజునే నామినేషన్ల వర్షం కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయన్న చర్చ సాగుతోంది. శీనన్న ఆశీస్సులు ఎవరికి ఉంటాయోనని చర్చించుకుంటున్నారు.
తలనొప్పిగా ఎంపిక ప్రక్రియ
మైనార్టీ కోటాలో వర్గాల మధ్య సమతుల్యత, స్పెషల్ నాలెడ్జ్ కేటగిరీలో అర్హతల ఎంపిక వంటి అంశాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. ఒకరికి అవకాశం ఇస్తే, మరో వర్గం అసంతృప్తి చెందే పరిస్థితి ఉండడంతో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. నామినేషన్ల గడువు సమయం దగ్గర పడుతున్న కొద్ది ఆశావహుల్లో ఉత్కంఠ పెరుగుతోంది. కాగా, కో ఆప్షన్ పదవులు ఎవరిని వరిస్తాయోనని ఆసక్తి నెలకొంది.


