కోనరావుపేట/వేములవాడఅర్బన్: రైతులు వాణిజ్య పంటలు సాగు చేయాలని, పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం ధర్మారం, వేములవాడ మండలం అనుపురం గ్రామంలో నాంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ప్రారంభించారు. కోనరావుపేట మండలకేంద్రంలో జరిగిన ఎల్లమ్మ సిద్ధోగంలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతులకు పెద్దపీట వేస్తూ నాణ్యమైన విద్యుత్, ఎరువులు, మెరుగైన విత్తనాలు అందిస్తున్నారని వివరించారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. మిల్లర్లు కూడా ప్రభుత్వానికి సహకరించాలన్నారు. రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని, ఆయిల్‌పాం సాగు చేయాలని సూచించారు. కార్యక్రమాల్లో తహసీల్దార్ వరలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, కౌన్సిలర్ కాశ శ్రీనివాస్, సర్పంచులు బోయిని దేవరాజు, శేర్ల రాజేశ్వరి, కాంగ్రెస్ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్‌పాషా, నందూగౌడ్, కర్రోళ్ల భాస్కర్, బాలరాజు, కార్తీక్, మల్లేశం, ఎర్రం రాజు, సత్తయ్య, ఆగయ్య, ప్రదీప్, సల్మాన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లు
చందుర్తి(వేములవాడ): అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం చందుర్తి రైతు వేదికలో 90 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. మండలంలో సాగు నీటి కోసం ఆశిరెడ్డిపల్లె కొత్త చెరువులోకి ఎల్లంపల్లి నీటిని మళ్లించేందుకు రూ.23లక్షలతో కాలువ పనులు కొనసాగుతున్నాయన్నారు. కలికోట సూరమ్మ చెరువు పనులకు రూ.320 కోట్లు అవసరం ఉండగా, ప్రస్తుతం పనులు ప్రారంభించేందుకు రూ.250 కోట్లు మంజూరయ్యాయని, పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి, ఉపాధ్యక్షుడు బొజ్జ మల్లేశం, సర్పంచ్ పులి సత్తయ్య, తహసీల్దార్ గొట్టే భూపతి, ఎంపీడీవో లెంకల రాధ, పార్టీ అధ్యక్షుడు చింతపంటి రామస్వామి, నాయకులు పాల్గొన్నారు.


