కురిసిన వాన.. తడిసిన ధాన్యం | - | Sakshi
Sakshi News home page

కురిసిన వాన.. తడిసిన ధాన్యం

Apr 20 2026 9:17 AM | Updated on Apr 20 2026 9:17 AM

వీర్నపల్లి/తంగళ్లపల్లి/సిరిసిల్లఅర్బన్‌/చందుర్తి: జిల్లాలో ఆదివారం కురిసిన అకాల వర్షానికి పంటలకు తీవ్ర నష్టం కలిగింది. ఐకేపీ సెంటర్లలో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఈదురుగాలులకు పొలంలోనే పంట నేలవా లింది. ధాన్యం కుప్పలపై కప్పిన టార్పాలిన్లు కొట్టుకుపోయాయి. వీర్నపల్లి మండలం శాంతి నగర్‌లో నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలను లైన్‌మన్‌ వెంకటి ఆధ్వర్యంలో పునరుద్ధరించారు. కూలిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేశారు.

సిరిసిల్ల శివారులో..

పెద్దూరు, రగుడు, చంద్రంపేట, బోనాల గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసింది. పెద్దూరు కేంద్రంలో సుమారు వెయ్యి క్వింటాళ్ల వరకు ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలను నాయకులు లింగంపల్లి సత్యనారాయణ, అశోక్‌రావు పరిశీలించారు.

చెట్ల కొమ్మలు తొలగించిన గ్రామస్తులు, పోలీసులు

చందుర్తి మండలం మూడపల్లిలోని రోడ్డుపై కూలిన చెట్లతో శనివారం అర్ధరాత్రి వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది. పోలీసులు చెట్లకొమ్మలు తొలగించేందుకు ప్రయత్నించగా సాధ్యం కాలేదు. సమాచారం తెలుసుకున్న సర్పంచ్‌ భర్త చిలుక అంజిబాబు, కొందరు గ్రామస్తులను తీసుకెళ్లి కొమ్మలను గొడ్డలితో నరికి తొలగించారు.

Advertisement
 
Advertisement
Advertisement