సిరిసిల్లటౌన్: పార్లమెంటులో రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన విపక్షాలకు మహిళలే బుద్ధి చెబుతారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. సిరిసిల్లలోని తన నివాసంలో ఆదివారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడారు. దేశవ్యాప్తంగా మహిళలు 33 శాతం రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తుంటే, పార్లమెంటులో ఈ బిల్లు ప్రవేశపెట్టిన తరుణంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు వ్యవహరించిన తీరు శోచనీయమన్నారు. కాంగ్రెస్ పార్టీకి మహిళా సాధికారతపై చిత్తశుద్ధి లేదన్నారు. అటు సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్, ఇటు కాంగ్రెస్ ప్రతినిధి ఆది శ్రీనివాస్ ఇద్దరూ మహిళా బిల్లు విషయంలో తమ స్వార్థ రాజకీయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని విమర్శించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా భారతీయ జనతా పార్టీ మహిళా బిల్లును విడిచిపెట్టబోదని, 33 శాతం రిజర్వేషన్ల ప్రక్రియను ఖచ్చితంగా పూర్తి చేస్తుందని స్పష్టం చేశారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నాల తిరుపతిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు బర్కం లక్ష్మీనవీన్‌యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్లు కొండ వర్షిని, మేర్గు మంజుల, ఊరగొండ లక్ష్మి, వేమనపల్లి శోభ, గుర్రం అనసూర్య, వేముల వైశాలి, రామలింగారెడ్డి, భాగయ్య, వంతడుపుల సుధాకర్ పాల్గొన్నారు.


