కొనుగోళ్లు ప్రారంభించేదెప్పుడో? | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లు ప్రారంభించేదెప్పుడో?

Apr 19 2026 8:17 AM | Updated on Apr 19 2026 8:17 AM

దళారులు కొనుగోలు చేస్తున్న వైనం

ఆకాశంలో మబ్బులు.. ఆందోళనలో రైతులు

వేములవాడ/వేములవాడరూరల్‌/ఇల్లంతకుంట: జిల్లాలో వరికోతలు మొదలయ్యాయి. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యాన్ని తీసుకొచ్చి ఆరబోస్తున్నారు. పది రోజుల క్రితమే వరికోతలు మొదలుకావడంతో కేంద్రాల్లో కుప్పలుగా పేరుకుపోతున్నాయి. తేమశాతం వచ్చిన రైతులు నిత్యం ధాన్యం కుప్పల వద్దనే కాపలా ఉంటున్నారు. వేములవాడరూరల్‌ మండలం బాలానగర్‌ కొనుగోలు కేంద్రంలో భారీగా వడ్లకుప్పలు పేరుకుపోయాయి. ఇల్లంతకుంట మండలంలోని పెద్దలింగాపూర్‌లో దళారులు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం స్పందించడం లేదు.

భయపెట్టిస్తున్న మొగులు

ఇప్పటికే పంట కోసిన రైతులు, పొలంలోనే ఉన్న రైతులు ఆకాశాన్ని చూసి భయాందోళన చెందుతున్నారు. ధాన్యం కుప్పలు తడువకుండా ఎలా కాపాడుకోవాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. పొలంలోని పంట వడగండ్ల వానకు నేలరాలిపోతుందనే ఆందోళన మరికొందరిలో ఉంది.

దళారుల ప్రవేశం

ఇల్లంతకుంట మండలంలోని చాలా గ్రామాల్లో దళారులు పొలాల వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ప్రధానంగా పెద్దలింగాపూర్‌లో రైతువేదిక వద్ద ఉన్న కొనుగోలు కేంద్రంలో తగినంత స్థలం లేకపోవడంతో రైతులు దళారులకు అమ్ముకుంటున్నారు. రైతుల అవసరాన్ని ఆసరాగా చేసుకుంటున్న ప్రైవేట్‌ వ్యాపారులు క్వింటాలుకు రూ.1,750 మాత్రమే చెల్లిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement