ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని రామాజీపేటలో డీఎస్పీ నాగేంద్రచారి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా శనివారం విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన దళితుడు శ్రావణపల్లి నాంపల్లి భూమిని ఆక్రమించి కొనుగోలు కేంద్రంగా ఉపయోగిస్తున్నారని బాధితుడు ఫిర్యాదు చేసి నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. ఈమేరకు సర్పంచ్ చొప్పరి భూమయ్యతోపాటు ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైనట్లు వివరించారు.
జిల్లా స్థాయి కేసీఆర్ కప్ క్రికెట్ పోటీలు ప్రారంభం
సిరిసిల్ల అర్బన్: జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న కేసీఆర్ కప్ జిల్లా స్థాయి క్రికెట్ పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. ఇల్లంతకుంట సూపర్ కింగ్స్(ముస్కానిపేట), రుద్రంగి రెబల్స్(మానాల) మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌ను బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి ప్రారంభించారు. గూడూరి ప్రవీణ్, కొండూరి సాకేత్‌రావు, మ్యాన రవి, కుంభాల మల్లారెడ్డి, బాలమల్లు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించండి
సిరిసిల్ల ఎడ్యుకేషన్: జిల్లాలోని ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని జిల్లా విద్యాధికారి జగన్మోహన్‌రెడ్డిని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం కోరారు. ప్రధానంగా గతేడాది వేసవిలో ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణ పొందిన ఉపాధ్యాయులు, ఆర్పీలకు ఈఎల్స్ మంజూరు, ప్రమోషన్ పొందిన ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని కోరారు. రెండేళ్లుగా సర్దుబాటు చేసిన ఉపాధ్యాయులను ఈనెల 23న పాత పాఠశాలలకు పంపించాలన్న అంశాలను డీఈవో దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయాలపై స్పందించిన డీఈవో త్వరలోనే కలెక్టర్‌ను కలిసి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సంఘం నాయకులు తెలిపారు.


