● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల: ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆస్పత్రికి వచ్చే రోగులకు, ప్రజలకు వివరించాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌నగర్ అర్బన్ ఆరోగ్య వైద్యకేంద్రాన్ని కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. ముందుగా ల్యాబ్, ఇన్‌పేషెంట్ వార్డ్, వ్యాక్సిన్లు, ఓపీ రిజిస్టర్ పరి శీలించారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ తనిఖీ చేశారు. పలువురు పేషెంట్లతో కలెక్టర్ నేరుగా మాట్లాడారు. ఆస్పత్రి వచ్చే వారికి అవసరమైన మందులు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రం డాక్టర్ రేణుక, వైద్య సిబ్బంది ఉన్నారు.
తరచూ రక్తస్రావమైతే పరీక్షలు చేయించుకోవాలి
సిరిసిల్ల: తరచూ రక్తస్రావమైతే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి వద్ద శుక్రవారం ప్రపంచ హీమోపిలియా దినోత్సవం సందర్భంగా వైద్యాధికారులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. రజిత మాట్లాడుతూ హీమోపిలియా అనే వ్యాధితో రక్తం గడ్డకట్టే అవకాశం లేకపోవడంతో రక్తస్రావమవుతుందన్నారు. గర్భధారణ సమయంలో సరైన పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా ఆస్పత్రి నుంచి గాంధీచౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారులు రేఖ, సాహితీ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
పోటీలతో క్రీడా నైపుణ్యాలు వెలికితీత
సిరిసిల్ల అర్బన్: యువతలో క్రీడా నైపుణ్యాలు వెలికితీసేందుకు క్రికెట్ పోటీలు దోహదపడతాయని సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి పేర్కొన్నారు. కేసీఆర్ కప్ క్రికెట్ పోటీల ముగింపు సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. గ్రామీణ, పట్టణ స్థాయి నుంచి జాతీయస్థాయి క్రికెట్ పోటీల్లో యువత పాల్గొనేలా ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో విన్నర్‌గా నిలిచిన సిరిసిల్ల డాల్ఫిన్స్‌కు కేసీఆర్ కప్‌తోపాటు రూ.50వేలు నగదు, రన్నరప్‌గా నిలిచిన సిరిసిల్ల విక్టర్ టీమ్‌కు కప్‌తోపాటు, రూ.20వేలు నగదు అందజేశారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, రాష్ట్ర నాయకులు గూడూరి ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, 29వ వార్డు కౌన్సిలర్ గెంట్యాల శ్యామలశ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి
సిరిసిల్లటౌన్/వేములవాడఅర్బన్: టీఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సమ్మె సన్నాహక కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సిరిసిల్ల, వేములవాడ డిపోల ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో గ్యారేజ్ యూనిట్ ప్రతినిధులు నిరసన చేపట్టారు. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ జాతీయం చేసుకోవాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి జీపీసింగ్, సిరిసిల్ల డిపో జేఏసీ గ్యారేజ్ కమిటీ కన్వీనర్లు టీవీసీ రావు, శేఖర్‌రావు, కో–కన్వీనర్లు సంతోష్, రవి, జాహిద్ హుస్సేన్, కొమురయ్య, ఆంజనేయులు, వేములవాడలో జేఎసీ నాయకులు స్వర్ణలత, లక్ష్మన్, శ్రీకాంత్, కాళిదాసు పాల్గొన్నారు.


