జిల్లాలో 231 కొనుగోలు కేంద్రాలు 3 లక్షల టన్నుల ధాన్యం సేకరణకు ఏర్పాట్లు ‘ఏ’ గ్రేడు రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2,389
వారం రోజుల్లో కేంద్రాలు ప్రారంభిస్తాం
ముస్తాబాద్(సిరిసిల్ల): వరికోతలు మొదలయ్యాయి. అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యం.. కొనుగోలు కేంద్రాలకు చేరుతోంది. ప్రభుత్వం సైతం ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేస్తోంది. రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం సేకరణ సాఫీగా సాగేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 231 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ పూర్తయింది.
3 లక్షల టన్నులు లక్ష్యం
జిల్లాలో లక్షన్నర ఎకరాలలో ఈ యాసంగిలో వరిపంటను సాగుచేశారు. అందుకు అనుగుణంగా 3లక్షల టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. ఇందులో 133 ఐకేపీ కొనుగోలు కేంద్రాలు, పీఏసీఎస్ 96, మెప్మా 1, డీసీఎంఎస్ 1 కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. కలెక్టర్ గరీమా అగ్రవాల్, జిల్లా పౌరసరఫరా అధికారులు ధాన్యం సేకరించే సిబ్బందికి ఒక రోజు శిక్షణ ఇచ్చారు.
కేంద్రాల్లో ఏర్పాట్లు
ఐకేపీ, ప్యాక్స్ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పిస్తున్నామని అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా మండుటెండల నుంచి రక్షణకు తాగునీరు. టెంట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేస్తున్నారు. తూకం వేసే యంత్రాలు, తేమశాతం పరీక్షించే యంత్రాలను సరఫరా చేశారు. టార్పాలిన్లు, గన్నీబ్యాగులను సిద్ధం చేశారు. ఏఈవో ధ్రువీకరించిన అనంతరం సిబ్బంది ధాన్యం తూకం వేస్తారు. ఎప్పటికప్పుడు రైతుల ధాన్యాన్ని ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. రైస్‌మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ల ఫోన్ నంబర్లను కేంద్రాలలో అందుబాటులో ఉంచుతున్నారు. హమాలీల కొరత లేకుండా సమన్వయం చేస్తున్నారు. రైతులకు క్వింటాలు ఏ–గ్రేడు రకం ధాన్యానికి రూ.2,389, బీ–గ్రేడు రకానికి రూ.2,369 ఇస్తున్నారు.
ఆవునూర్‌లో వరికోతలు
జిల్లాలో తొలుత ధాన్యం కోతలు ఆవునూర్‌లో మొదలు పెడతారు. ఇక్కడి రైతులు నెలరోజుల ముందుగానే పంటలు సాగుచేస్తారు. దీంతో అధికారులు జిల్లాలో మొదట ఆవునూర్‌లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. ఏ సీజన్‌లోనైనా ఆవునూర్‌తోపాటు గూడెంలో వరికోతలు ముందుగా మొదలు పెడతున్నారు.
జిల్లాలో ధాన్యం సేకరణ కు అన్ని ఏర్పాట్లు చేశాం. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతులు కల్పిస్తున్నాం. వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాం. మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్లు ప్రణాళిక మేరకు సేకరణలో భాగాస్వాములు కావాలి. తాగునీటి వసతి, ఓఆర్‌ఎస్, టెంట్లు ఏర్పాటు చేస్తాం.
– బుచ్చిబాబు, డీఎస్‌వో


