● ‘నాలుగు’ సీట్లపై ‘అందరి’ ఆశలు ● వేములవాడలో నేటి నుంచి నామినేషన్లు ● విప్ ‘ఆది’ మద్దతే కీలకం
వేములవాడ: వేములవాడ మున్సిపాలిటీలో కో–ఆప్షన్ సందడి మొదలైంది. ఇన్నాళ్లు పార్టీని పట్టుకొని ఉన్న నాయకులు తమకే ప్రాధాన్యం ఇవ్వాలని కోరుతూ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే విప్ ఆది శ్రీనివాస్ మద్దతుతోనే కో–ఆప్షన్‌లో కొలువు దీరనున్నారు.
నాలుగు స్థానాలపై పోటాపోటీ
వేములవాడ మున్సిపాలిటీలో మొత్తం నాలుగు కో–ఆప్షన్ పోస్టులున్నాయి. ఇందులో 2 స్థానాలు మైనారిటీలకు, 2 స్థానాలు స్పెషల్ నాలెడ్జ్ పర్సన్స్‌కు కేటాయించారు. ఇందులో ఒక మహిళకు ప్రాధాన్యమివ్వాల్సి ఉంటుంది. మైనారిటీ కోటాలో తీవ్ర పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. సామాజికంగా, రాజకీయంగా యాక్టివ్‌గా ఉన్న నాయకులు ఈసారి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ప్రయత్నిస్తున్నా రు. మరోవైపు స్పెషల్ నాలెడ్జ్ కేటగిరీలో విద్యావేత్తలు, సామాజిక సేవకులు, రిటైర్డ్ అధికారులు మా త్రమే కాకుండా మాజీ కౌన్సిలర్లు, మాజీ వార్డుమెంబర్లు రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పైరవీలు షురూ..
ఇప్పటికే దాదాపు ప్రతీ వర్గం నుంచి 8 నుంచి 10 మంది వరకు ఆశావహులు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఆశావహులు పార్టీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. మైనార్టీల నుంచి సయ్యద్ సాబీర్, మహమ్మద్ రజాక్, పీర్ మహమ్మద్, అక్రమ్‌పాషా, బాబూన్‌లు ఉండగా, సాయిని విజయ, కట్కూరి శ్రీనివాస్, చీకోటి శ్రీహరి, కూర దేవయ్య, తోట లహరి, నామాల ఉమాలక్ష్మీరాజం, ముప్పిడి సునందశ్రీనివాస్, కూరగాయల శ్రీశైలం, సగ్గు పద్మదేవరాజు, ముద్రకోల వెంకటేశ్, జి.ప్రకాశ్, ఇన్నారెడ్డి, ఆరోగ్యమ్మ పేర్లు వినిపిస్తున్నాయి.
నేటి నుంచి నామినేషన్లు
వేములవాడ మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికకు అధికారులు ఈనెల 15న నోటిఫికేషన్ వెలువరించారు. గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నోటిఫికేషన్ వెలువడిన నుంచి ఏడు రోజులలో దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అనంతరం మూడు రోజుల్లో స్క్రుటినీ నిర్వహిస్తారు. ఆ తర్వాత 14 రోజుల వ్యవధిలో కౌన్సిల్ సమావేశం నిర్వహించి చేతులెత్తే విధానంతో ఓటింగ్ నిర్వహించి సభ్యులను ఎన్నుకుంటారని కమిషనర్ సంపత్‌కుమార్ బుధవారం తెలిపారు.
విప్ ఆశీస్సులు ఉంటేనే..
వేములవాడ మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన విషయం తెలసిందే. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కోఆప్షన్‌పై ఆశలు చిగురించాయి. అయితే ఎవరికీ అవకాశం ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఆశావహులు తమ ప్రతిపాదనలతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. విప్ ఆది శ్రీనివాస్ దీవెనలు ఉంటేనే కోఆప్షన్ పదవి వరించే అవకాశం ఉంది. ఆశావహులు విప్ దీవెనల కోసం ప్రదక్షిణలు చేస్తున్నారు.


