● అన్నదాతలకు అందని పరిహారం ● ఏటా ప్రకృతి ప్రకోపంతో నష్టపోతున్న రైతులు ● సర్వే చేసి నివేదిక ఇస్తున్న అధికారులు ● పరిహారం కోసం పడిగాపులు
ఇతను ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రైతు హన్మయ్య. గ్రామ శివారులో తనకున్న మూడు ఎకరాల్లో రెండేళ్ల క్రితం వరిపంటను సాగు చేశాడు. పంట చేతికొచ్చే సమయంలో వడగండ్ల వానతో వరిగింజలు పూర్తిగా రాలిపోయాయి. అధికారులు క్షేత్రస్థాయిలో పంటనష్టాన్ని పరిశీలించారు. పరిహారం కోసం నివేదికను పంపామని అధికారులు చెపుతుండగా, రెండేళ్లుగా హన్మయ్యకు పరిహారం అందలేదు.
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండిస్తున్న పంటలు ప్రకృతి ప్రకోపానికి చేతికి అందకుండా పోతున్నాయి. వడగండ్లు.. అకాల వర్షాలు.. భూగర్భ జలాలు అడుగంటి ఎండుతున్న పంటలతో అన్నదాతలు ఏటా నష్టపోతూనే ఉన్నారు. భూతల్లిని నమ్ముకొని పంటలు సాగుచేస్తున్న రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. వడగండ్లు పడ్డప్పుడు పంటనష్టంపై సర్వే చేస్తున్న అధికారులు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. పంటలకు పెట్టుబడి పెట్టి నిండా మునిగిన రైతన్నలను ఆదుకునేవారు లేక అప్పులపాలవుతున్నారు. వడగండ్లు.. అకాల వర్షాలతో పంటనష్టంపై ప్రత్యేక కథనం.
కడగండ్లు మిగిల్చిన వడగండ్లు
వరిపంట పొట్టదశకు చేరుకోవడంతో రైతులు నీళ్లు పారిస్తూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఈ సమయంలోనే ఇటీవల కురిసిన వడగండ్ల వానతో వరిపంటకు తీవ్ర నష్టం జరిగింది. చేతికొచ్చే దశలో వర్షం కురువడంతో వరిగొలుకలు రాలిపోయాయి. మామిడికాయలు నేలరాలాయి. జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, కోనరావుపేట, గంభీరావుపేట మండలాల్లో వరిపంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. క్షేత్రస్థాయిలో సర్వే చేసిన వ్యవసాయాధికారులు జిల్లా వ్యాప్తంగా 850 ఎకరాల్లో పంటకు నష్టం వాటిల్లినట్లు నివేదికలు ఇచ్చారు. కానీ క్షేత్రస్థాయిలో అంతకు రెండింతల విస్తీర్ణంలో వరిపంటకు నష్టం జరిగినట్లు రైతుల ద్వారా తెలుస్తోంది.
అందని పరిహారం
ఏటా వడగండ్లు, అకాల వర్షాలతో వరిపంటకు తీవ్ర నష్టం జరుగుతుంది. సర్వే చేస్తున్న అధికారులు నివేదికలకే పరిమితమవుతున్నారు. పంటనష్టం వివరాలు, రైతుల ఖాతాల వివరాలను పంపిస్తున్నారే తప్ప తర్వాత ఏం జరుగుతుందనేది పట్టించుకోవడం లేదు. అయితే గత కొన్నేళ్లుగా పరిహారం రావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నివేదికలు పంపాం
ఈ సీజన్‌లో అకాల వర్షాలతో జిల్లా వ్యాప్తంగా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, వీర్నపల్లి, కోనరావుపేట మండలాల్లో 850 ఎకరాల్లో వరి, మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదికలు పంపాం. పరిహారం డబ్బులు రైతుల ఖాతాల్లోనే జమవుతాయి.
– అఫ్జల్‌బేగం, జిల్లా వ్యవసాయాధికారి


