సిరిసిల్ల: అప్రమత్తంగా ఉంటేనే అగ్నిప్రమాదాల నివారణ సాధ్యమవుతుందని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. కలెక్టరేట్‌లో మంగళవారం అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరించి మాట్లాడారు. అగ్నిమాపక దళ సిబ్బంది స్మారకార్థం ఏటా ఏప్రిల్ 14 నుంచి 20 వరకు దేశవ్యాప్తంగా అగ్నిమాపక దళ వారోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రచారం చేస్తూ చైతన్యవంతులను చేయడం వారోత్సవాల ముఖ్య ఉద్దేశమని వివరించారు. వారం పాటు జిల్లాలోని అన్ని స్కూల్స్, హాస్పిటల్స్, అపార్టుమెంట్లు, గ్యాస్ గోడౌన్స్, పెట్రోల్ బంక్స్, సినిమా హాళ్లు, పరిశ్రమలకు వెళ్లి అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అగ్నిమాపక పరికరాల వినియోగం, మంటలు ఆర్పడం, భవనాల నుంచి ఎలా బయటికి రావడం, పొగ నిండిన గదుల నుంచి బయట పడడం తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిరిసిల్ల ఫైర్ ఆఫీసర్ నరేందర్, సిబ్బంది పాల్గొన్నారు.


