వేములవాడ: ఎములాడ రాజన్నకు 18 రోజుల్లో భక్తులు భీమన్న ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో సమర్పించుకున్న హుండీల ద్వారా రూ.93,52,748 నగదు సమకూరినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. మంగళవారం భీమేశ్వర సదన్‌లో చేపట్టిన లెక్కింపులో 60గ్రాముల బంగారం, 2కిలోల 900 గ్రాముల వెండి సమకూరిందన్నారు. కార్యక్రమంలో కరీంనగర్ ఏసీ ఆఫీస్ అధికారి రాజమౌళి, ఏఈవోలు, పర్యవేక్షకులు, ఆలయ అధికారులు, సిబ్బంది, శివరామకృష్ణ భజన మండలి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
అట్రాసిటీ కేసుపై డీఎస్పీ విచారణ
ఎల్లారెడ్డిపేట: ఎల్లారెడ్డిపేట మండలం రాచర్లబొప్పాపూర్ గ్రామానికి చెందిన బెస్త నరేశ్‌ను కులం పేరుతో దూషించిన సంఘటనపై మంగళవారం సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి విచారణ చేపట్టారు. గ్రామంలోని పంచాయతీ ఆఫీస్‌లో గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించారు. విచారణలో గ్రామస్తులు తెలిపిన వివరాలను రికార్డు చేసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రాణిప్రసాద్‌కు వంశీ గ్లోబల్ ఎక్స్‌లెన్స్ అవార్డు
సిరిసిల్లటౌన్: సిరిసిల్లకు చెందిన ప్రముఖ బాలసాహితీవేత్త కందేపి రాణిప్రసాద్ వంశీగ్లోబల్ ఎక్స్‌లెన్స్ అవార్డు పొందారు. హైదరాబాద్‌కు చెందిన వంశీ ఆర్ట్స్ థియేటర్ ఆధ్వర్యంలో పరాభవ నామ సంవత్సర సందర్భంగా సాంస్కృతిక, సాహితీ రంగాల్లో ప్రతిభామూర్తులకు అవార్డులను సోమవారం హైదరాబాద్‌లో అందజేశారు. వంశీ ఆర్ట్స్ అధినేత వంశీరామరాజు, తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్ డాక్టర్ వెలుదండ నిత్యానందరావు, ప్రముఖ దర్శకుడు రేలంగి నరసింహారావు, దూరదర్శన్ డైరెక్టర్ కామేశ్వరి చేతుల మీదుగా అవార్డును స్వీకరించారు. సిరిసిల్ల కవులు, రచయితలు ఆమెకు అభినందనలు తెలిపారు.
అడవి పదిరలో
చిరుత సంచారం
వీర్నపల్లి: వీర్నపల్లి మండలం అడవి పదిర గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. ధర్మారం చెరువు ప్రాంతంలోని మైసమ్మ లొద్ది వద్ద సోమవారం రాత్రి చిరుత ప్రత్యక్షం కావడంతో రైతులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో వన్యప్రాణుల సంచారం పెరుగుతుండటంతో అటవీప్రాంతానికి ఆనుకుని ఉన్న పొలాల్లోకి వెళ్లాలంటేనే రైతులు వణికిపోతున్నారు. వీర్నపల్లి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ రంజిత్ కుమార్, అడవిపదిర బీట్ అధికారి వేణును వివరణ కోరగా అది చిరుత పాద ముద్రలే అని అన్నారు. రైతులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
ఉచిత ఎంసెట్ కోచింగ్‌ను సద్వినియోగం చేసుకోవాలి
సిరిసిల్ల అర్బన్ : ఉచిత ఎంసెట్ కోచింగ్ సెంటర్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ విజయ రఘునందన్ అన్నారు. మంగళవారం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో1977–79లో చదివిన పూర్వ విద్యార్థులు నాగుల రవి, పత్తిపాక మదన్, గాజుల ప్రతాప్‌లు ఏర్పాటు చేసిన ఉచిత ఎంసెట్ కోచింగ్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో అధ్యాపకులు బుర్ర వెంకటేశం, సామల వివేకానంద, రవీందర్, రాజశేఖర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


