సిరిసిల్ల అర్బన్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షనర్లకు తీవ్రంగా నష్టం కలిగించే పెన్షన్ వ్యాలిడేషన్ చట్టంను వెంటనే రద్దు చేయాలని విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మాదాసు బలరాం కోరారు. బుధవారం కలెక్టరేట్ వద్ద జిల్లా విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వినతిపత్రాన్ని కలెక్టరేట్ ఏవో రాంరెడ్డికి అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పెన్షన్ వ్యాలిడేషన్ చట్టం ప్రకారం 1.1.2026 కంటే ముందు ఉద్యోగ విరమణ పొందిన పెన్షనర్లకు పీఆర్‌సీ, డీఆర్‌లు, పెన్షన్ పెంపుదల ఉండవన్నారు. పెన్షనర్లకు నష్టం కలిగించే వ్యాలిడేషన్ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. ఆలిండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ ఆదేశాల ప్రకారం ప్రధానమంత్రికి చేరేలా చూడాలని కలెక్టర్లకు వినతిపత్రం అందజేశారు. విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు చౌకి సుధాకర్, విశ్రాంత ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


