వంటగ్యాస్‌ కొరత లేదు | - | Sakshi
Sakshi News home page

వంటగ్యాస్‌ కొరత లేదు

Mar 26 2026 7:21 AM | Updated on Mar 26 2026 7:21 AM

కృత్రిమ కొరత సృష్టిస్తే కేసులు

వినియోగదారులు హైరానా పడొద్దు

సమస్యలు ఉంటే 80084 29738లో సంప్రదించండి

‘సాక్షి’తో జిల్లా పౌరసరఫరాల అధికారి ఎల్‌.బుచ్చిబాబు

సిరిసిల్ల: జిల్లాలో వంటగ్యాస్‌ కృత్రిమ కొరతను సృష్టిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని జిల్లా పౌరసరఫరాల అధికారి

ఎల్‌.బుచ్చిబాబు హెచ్చరించారు. జిల్లాలో వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ కొరత లేదని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలో పక్షం రోజులుగా జరుగుతున్న యుద్ధం కారణంగా వంటగ్యాస్‌ సరఫరాలో జాప్యం, పెట్రోల్‌బంకుల్లో ఇంధన కొరత ఉందని వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు జిల్లా పౌరసరఫరాల అధికారిని ‘సాక్షి’ బుధవారం ఇంటర్వ్యూ చేసింది. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే...

బుకింగ్‌ల సంఖ్య పెరిగింది

పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో క్రూడాయిల్‌ సరఫరాలో జాప్యమవుతుందని, వంటగ్యాస్‌ కొరత ఏర్పడుతుందని మీడియాలో ప్రచారంతో ప్రజలు హైరానాపడ్డారు. అదనపు సిలిండర్‌ను ఆన్‌లైన్‌ బుకింగ్‌ చేసుకుంటున్నారు. జిల్లాలో నెలకు సగటును 2,500 నుంచి 3వేల వరకు సిలిండర్ల రీఫిల్లింగ్‌ బుకింగ్‌ జరిగేది. యుద్ధం నేపథ్యంలో ఒక్కసారిగా 5 వేల సిలిండర్లు బుక్‌ అయ్యాయి. దీంతో సరఫరాలో జాప్యమవుతుంది. పట్టణాల్లో 25 రోజులకు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులకు ఒక్క సిలిండర్‌ సరఫరా అవుతుంది.

13 కేసులు బుక్‌ చేశాం

జిల్లాలో చేపట్టిన తనిఖీల్లో గృహావసరాలకు వాడాల్సిన ఎల్‌పీజీ గ్యాస్‌ను కమర్షియల్‌గా వినియోగిస్తున్నట్లు గుర్తించి 13 కేసులు బుక్‌ చేశాం. 33 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నాం. ఎవరైన సిలిండర్లకు కృత్రిమ కొరత సృష్టిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేసి, చట్టపరంగా శిక్షిస్తాం. జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్‌ ఏజెన్సీలు 11 ఉండగా.. 1,49,453 కనెక్షన్లు ఉన్నాయి. 685 కమర్షియల్‌ కనెక్షన్లు ఉన్నాయి.

పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు ఉన్నాయి

జిల్లాలో 78 పెట్రోల్‌బంకులు ఉన్నాయి. అంతటా పెట్రోల్‌, డీజిల్‌ నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. సోషల్‌మీడియాలో వస్తున్న వదంతులు, ప్రచారాలు నమ్ముతూ కొన్ని పెట్రోల్‌బంకుల్లో క్యూ కడుతున్నారు. నిజానికి జిల్లాలో ఇంధన కొరత లేదు. పెట్రోల్‌ బంకులకు ఐవోసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీ కంపెనీలు అరువుపై ఇంధనాన్ని సరఫరా చేసేవి. ఇప్పుడు యుద్ధంతో నగదు చెల్లిస్తేనే పెట్రోల్‌, డీజిల్‌ పంపిస్తామని చెప్పడంతో కొంత గందరగోళం నెలకొన్నట్లు తెలిసింది. ఆయా కంపెనీల సేల్స్‌ ఆఫీసర్లతో మాట్లాడుతూ పెట్రోల్‌, డీజిల్‌ ట్యాంకర్లను తెప్పిస్తున్నాం.

హెల్ప్‌డెస్క్‌ ఏర్పాటు

జిల్లాలో ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్లు, డీజిల్‌, పెట్రోల్‌ సరఫరాలో ఎలాంటి సమస్యలున్నా జిల్లా స్థాయిలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశాం. కలెక్టర్‌ గరీమా అగ్రవాల్‌ ఆదేశాలతో కలెక్టరేట్‌లో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేసి ఆఫీస్‌ పనివేళల్లో ఫిర్యాదులను నమోదు చేస్తున్నాం. ఇప్పటికే చాలా మంది ఫిర్యాదు చేశారు. ఆ సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నాం. ఇంకా ఎవరికై నా సమస్యలు ఉంటే హెల్ప్‌డెస్క్‌ 80084 29738లో సంప్రదించవచ్చు.

వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లు

వారం రోజుల్లో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభిస్తాం. యాసంగి సీజన్‌ ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేశాం. 239 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. ఇందులో ఐకేపీ ఆధ్వర్యంలో 159, ప్యాక్స్‌ పరిధిలో 72, మెప్మా ఆధ్వర్యంలో 7, డీసీఎంఎస్‌ పరిధిలో ఒక్క కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తాం. గోదాములను పరిశీలిస్తున్నాం. యాసంగిలో 3 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశాం. గత అనుభవాల ప్రకారం 2.70 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలుకు గన్నీ సంచులను సిద్ధం చేస్తున్నాం. జిల్లాలోని ఎల్‌పీజీ గ్యాస్‌ వినియోగదారులు, పెట్రోల్‌, డీజిల్‌ వినియోగించే వాహనదారులు హైరానా పడకుండా.. అవసరాలకు మించి నిల్వలు చేయొద్దు. ఇబ్బందులు రాకుండా ముందుచూపుతో అన్ని జాగ్రత్తలను జిల్లా యంత్రాంగం తీసుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement