● విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: చెడుపై మంచి గెలుపునకు నిదర్శనంగా మానవాళి జరుపుకునే గొప్ప పండుగ హోలీ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని ఆయన నివాసానికి చేరుకున్న మహిళలు, కార్మికులు, వివిధ వర్గాల ప్రజలతో ఆయన మంగళవారం హోలీ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. హోలీ పండుగ సంప్రదాయాలు, ఐక్యత, ఆనందానికి నిదర్శనమన్నారు. ఈ పండుగ ప్రతీ కుటుంబంలో ఆనందం, సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. రంగులతో ఒకరినొకరు ఆహ్వానించుకుంటూ స్నేహభావాన్ని పంచుకునే ఈ వేడుక సమాజంలో సామరస్యాన్ని పెంపొందిస్తుందని పేర్కొన్నారు. ప్రజలు సురక్షితంగా, పర్యావరణహితంగా వేడుకలు జరుపుకోవాలని కోరారు. మున్సిపల్ చైర్మన్ పుల్కం రాజు, వైస్‌చైర్మన్ నరాల శేఖర్, కౌన్సిలర్లు తదితరులు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.


