బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే జైలు శిక్ష
వెంకటాపూర్ సంఘటన దురదృష్టకరం తప్పిదాలు పునరావృతమైతే ఉద్యోగం నుంచి తొలగిస్తాం కలెక్టర్ గరీమా అగ్రవాల్
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బాలల హక్కుల ఉల్లంఘనకు పాల్పడితే జైలు శిక్ష తప్పదని కలెక్టర్ గరీమా అగ్రవాల్ హెచ్చరించారు. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లోని అంగన్‌వాడీ కేంద్రంలో బాలుడిపై జరిగిన దాడి సంఘటన దురదృష్టకరమని శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. బాలుడిపై దాడికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లారన్నారు. తల్లిదండ్రులతో మాట్లాడి పోలీస్ సూచనలతో మెడికో లీగల్ కేసు కింద ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో బాలుడికి వైద్యపరీక్షలు చేయించినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన వెంటనే అంగన్‌వాడీ టీచర్‌ను పిలిపించి ఆరా తీయనగా సంఘటనపై అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేశారు. బీఎన్‌ఎస్ 118 సబ్‌సేక్షన్ 1, బాలల న్యాయచట్టం సెక్షన్ 75 ప్రకారం వెంకటాపూర్‌లోని రెండో అంగన్‌వాడీ కేంద్రం టీచర్ జాజాల రాణిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాలుడికి ఎల్వీ ప్రసాద్ ప్రాంతీయ ఆస్పత్రిలో చికిత్స అందించి, హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. షోకాజ్ నోటీస్‌కు అంగన్‌వాడీ టీచర్ వివరణ సంతృప్తికరంగా లేదని.. పూర్తిస్థాయిలో విచారణకు జిల్లా సంక్షేమాధికారితోపాటు ఎల్లారెడ్డిపేట తహసీల్దార్‌కు సూచించినట్లు తెలిపారు. విచారణ నివేదిక అనంతరం అంగన్‌వాడీ రాణిపై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాలు సురక్షితంగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. పిల్లలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎదుగుతారని, ఎవరూ ఎలాంటి అపోహలకు లోనుకావద్దని కోరారు. నాణ్యమైన పోషకాహారం అందిస్తూ బాలల హక్కులను కాపాడడంలో జిల్లా అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు.


