కంటిపాపను కాపాడండి
కరీంనగర్: ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మీ వచ్చిందని సంబురపడ్డారు. కూలి చేస్తేనే కడుపునిండే కుటుంబం అయినా తమ కూతురు అల్లారుముద్దుగా పెంచుకున్నారు. కానీ అంతలోనే ఆ చిన్నారి ఆరోగ్యం ప్రమాదకరంగా మారింది. వెంటనే వైద్యం అందిస్తేనే బతికే పరిస్థితులు వచ్చాయి. రెక్కాడితేనే డొక్కాడే పరిస్థితులు కావడంతో తమ కూతురు వైద్యానికి దాతలు సాయం చేసి ఆదుకోవాలని ఆ నిరుపేద తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రేకుర్తికి చెందిన రౌతు సంపత్–రాజేశ్వరీ దంపతులకు శ్రేయన్షి సంతానం. ఏడాదిన్నర వయస్సున్న శ్రేయన్షి తీవ్ర అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితికి చేరింది. హార్ట్ సమస్యతోపాటు బ్లడ్ ఇన్‌ఫెక్షన్ బ్రెయిన్‌కు సోకడంతో ఎన్సెఫలైటిస్ అనే వ్యాధి వచ్చింది. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. చిన్నారి చికిత్సకు రూ.5లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. కూలి పని చేసే కుటుంబం కావడంతో ఇంత భారీ మొత్తాన్ని భరించే స్థోమత లేక తల్లిదండ్రులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇప్పటికే బంధువులు, పరిచయస్తుల వద్ద రూ.లక్ష వరకు అప్పు తెచ్చి చికిత్స అందిస్తున్నారు. మిగతా డబ్బులు ఎలా సమకూర్చుకోవాలో తెలియక దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. దాతలు చేసే సహాయం తమ కూతురి ప్రాణానిన నిలబెడుతుందని ఆ నిరుపేద తల్లిదండ్రులు కోరుతున్నారు. సహాయం చేయాలనుకునే వారు ఫోన్‌పే లేదా గూగుల్‌పే 91603 89464, 99120 20718లో ఆర్థిక సహాయం చేయాలని చిన్నారి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.
ఆదుకోవాలని తల్లిదండ్రుల విన్నపం
ప్రాణాపాయ స్థితిలో చిన్నారి


