మత్తుకు బానిస కావద్దు
● సైకాలజిస్ట్ పున్నంచందర్
తంగళ్లపల్లి(సిరిసిల్ల): యువత మత్తుపదార్థాలకు బానిస కావద్దని సైకాలజిస్ట్ కె.పున్నంచందర్ కోరారు. తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీలోని ప్రభుత్వ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్, కళాశాలలోని విద్యార్థులకు బుధవారం అవగాహన కల్పించారు. పున్నంచందర్ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి అలవాట్లు మానసిక కృంగుబాటుకు, ఆత్మహత్య ఆలోచనలకు దారితీస్తాయన్నారు. ఒత్తిడిని అధిగమించేందుకు మత్తును ఆశ్రయించడం పరిష్కారం కాదన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్నా తల్లిదండ్రులు, నిపుణులతో పంచుకోవాలని సూచించారు. పరీక్షల ఒత్తిడిని ఎలా అధిగమించాలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. హెల్పింగ్ హార్ట్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు అలువాల ఈశ్వర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రజనీ, వైస్‌ప్రిన్సిపాల్ శ్రీవిద్య, ఉపాధ్యాయులు షాలిని, సవిత, శ్వేత, విజయశ్రీ పాల్గొన్నారు.
ఇల్లంతకుంట(మానకొండూర్): తమ గ్రామం మీదుగా బస్సులను పునరుద్ధరించాలని కోరుతూ మండలంలోని వెంకట్రావుపల్లి సర్పంచ్ చల్ల నవీన్‌రెడ్డి గ్రామస్తులతో కలిసి బుధవారం రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. గతంలో సిద్దిపేట, కరీంనగర్‌ల నుంచి నడిచిన బస్సులను నాలుగేళ్ల క్రితం రద్దు చేశారన్నారు. ఆ రెండు సర్వీసులను పునరుద్ధరించాలని కోరారు. నాయకులు మామిండ్ల కనకరాజు, మంద రాజు, సంపత్‌రెడ్డి, బత్తిని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
సిరిసిల్ల అర్బన్ : జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్ మినీస్టేడియంలో నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, తహసీల్దార్ మహేశ్‌కుమార్, మండల విద్యాధికారి దూస రఘుపతి తిలకించారు. వారు మాట్లాడుతూ క్రీడల్లో గెలుపోటములు సహజమని, క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. నియోజకవర్గస్థాయిలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు జిల్లాస్థాయికి ఎంపికవుతారని తెలిపారు.
ముస్తాబాద్(సిరిసిల్ల): మండల కేంద్రంలోని మతిస్థిమితం లేని ఓ మహిళను సఖీ కేంద్రం నిర్వాహకులు బుధవారం సిరిసిల్లకు తరలించారు. నెల రోజులుగా సంచరిస్తున్న సదరు మహిళ పరిస్థితిని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామస్తుల విన్నపంతో జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం స్పందించారు. సఖీ కేంద్రం బాలిక సంరక్షణ అధికారి కవిత ప్రత్యేక అంబులెన్స్‌తో ముస్తాబాద్‌కు వచ్చి, మతిస్థిమితం లేని మహిళతో మాట్లాడారు. ఆమె ఎలాంటి వివరాలు చెప్పకపోవడంతో, అంబులెన్స్‌లో సిరిసిల్లకు తీసుకెళ్లారు. అక్కడి వృద్ధాశ్రమంలో చేర్చినట్లు డీసీపీవో కవిత తెలిపారు.
మత్తుకు బానిస కావద్దు
మత్తుకు బానిస కావద్దు
మత్తుకు బానిస కావద్దు


