మున్సిపాలిటీలు అప్పగిస్తే.. అభివృద్ధి చేసి చూపిస్తా
అవినీతి రహిత పాలన అందిస్తాం
కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్
సిరిసిల్ల, వేములవాడల్లో ప్రచారం
సిరిసిల్ల/వేములవాడ: సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలలో బీజేపీని గెలిపిస్తే అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తానని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. సిరిసిల్ల, వేములవాడల్లో బుధవారం నిర్వహించిన స్ట్రీట్‌కార్నర్ మీటింగ్‌లలో మాట్లాడారు. కేసీఆర్ కొడుకు మాకు భయపడి సిరిసిల్లలోనే అడ్డాపెట్టి ఓటుకు రూ.10వేలు ఇస్తున్నాడట.. ఆ డబ్బులు తీసుకొని.. ఓట్లు మాత్రం పువ్వు గుర్తుకు వేయాలని కోరారు. మున్సిపల్ పీఠాన్ని బీఆర్‌ఎస్‌కు అప్పగిస్తే వానొస్తే గల్లీలు మునిగిపోతున్నాయన్నారు. కలెక్టరేట్‌కు పడవలు, ట్రాక్టర్లలో పోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. వస్త్రపరిశ్రమ సిరిసిల్లలో ఉంటే.. యారన్ డిపో అక్కడెందుకు అని ప్రశ్నించారు. కాంగ్రెసోళ్లు ప్రతీ కిలోపై కమీషన్లు దొబ్బుతున్నారని ఆరోపించారు. మురికినీటి శుద్ధిప్లాంట్‌ను పద్మనగర్‌లో నిర్మించి ఊరిని మురికినీటితో ముంచారని ఆరోపించారు. సుందరీకరణ పేరిట సిరిసిల్ల కొత్త చెరువులో చేపట్టిన పనులతో కొద్దిపాటి వర్షానికి నీళ్లు ఊరిలోకి వస్తున్నాయన్నారు. టెక్స్‌టైల్ పార్క్‌లో పరిశ్రమలు మూత పడుతున్నాయని, అపెరల్‌పార్క్‌లో షెడ్లు నిర్మించి వదిలేశారన్నారు. సిరిసిల్లలో ఏడు గ్రామాలను విలీనం చేసి ఉపాధిహామీని దూరం చేశారన్నారు. సిరిసిల్లకు 14, 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.29 కోట్లు మంజూరు చేశామని, అమృత్ పథకంలో రూ.50 కోట్లు ఇచ్చామని వివరించారు. పట్టణంలోని చిరువ్యాపారులకు రూ.21.52కోట్ల రుణాలు, స్వచ్ఛ భారత్‌లో రూ.44 కోట్లు ఇచ్చామని వివరించారు.
వేములవాడ ఎమ్మెల్యే అడ్డగోలు వ్యవహారం
ప్రశాంతంగా ఎన్నికలు జరగాలని తాము కోరుకుంటుంటే, వేములవాడ ఎమ్మెల్యే బీజేపీ నేతలను బెదిరిస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. తన మంచితనాన్ని అలుసుగా తీసుకుంటే ఉరుకునేది లేదన్నారు. డీజీపీ, ఎస్పీని ఇక్కడికి రప్పించాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాతితో కట్టాల్సిన ఆలయాన్ని సిమెంట్ కాంక్రిట్‌తో కడుతున్నారన్నారు. గుడి పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ఎములాడ రాజన్నకే శఠగోపం పెట్టిండని మండిపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె.సంగప్ప, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, బీజేపీ సిరిసిల్ల ఇన్‌చార్జి మీసాల చంద్రయ్య, జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, చెన్నమనేని వికాస్‌రావు, నాయకులు ఆడెపు రవీందర్, మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.


