
రాజన్న మండపం!
భక్తులకు దర్శన భాగ్యం కలిగేనా?
యాదాద్రి తరహాలో రాయి శిలలు వాడటం లేదా?
రాతితో ప్రాచీన పరంపర ప్రతిబింబిస్తుందంటున్న భక్తులు
పిల్లర్లకు పలకలు వేసినా నాణ్యంగానే ఉంటాయంటున్న అధికారులు
మేడారానికి ముందు రాజన్న దర్శనంపై అపోహలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్:
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయ పునర్ నిర్మాణం, అభివృద్ధి విషయంలో ఇప్పటికే గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ నిర్మాణం ఎలా సాగుతోందనే అంశం తెరపైకొచ్చింది. యాదాద్రి ఆలయాన్ని కృష్ణశిల రాయితో నిర్మించినట్టుగానే ఇక్కడ జరిగేనా లేక పిల్లర్లతో నిర్మిస్తారా? అనే చర్చ సాగుతోంది. సుమారు 70 పిల్లర్లతో స్లాబు వేసి రాజన్న ఆలయ మండపం నిర్మించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆలయ పునర్ని ర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.76కోట్లను మంజూరు చేసింది. యాదాద్రి ఆలయ నిర్మాణానికి రూ.300 కోట్లు గత ప్రభుత్వం ఖర్చు చేసింది. దీన్ని బట్టి చూస్తే యాదాద్రి తరహాలో రాజన్న ఆలయ నిర్మాణం పూర్తయ్యేనా అనే అపోహలు భక్తుల్లో నెలకొన్నాయి. దీనిపై ప్రభుత్వం, దేవాదాయశాఖ స్ప ష్టమైన వివరణ ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు.
పీఠాధిపతి రాకతో అపోహలు తొలగేనా?
ఈనెల 19న శృంగేరి పీఠాధిపతి జగద్గురు విధుశేకర భారతిస్వామి వేములవాడ ఆలయాన్ని సందర్శించి సలహాలు, సూచనలు అందించనున్నారు. ఈనేపథ్యంలో పీఠాధిపతి రాకతోనైనా ఆలయ నిర్మాణం విషయంలో స్పష్టత వచ్చేనా అని భక్తులు, స్థానికులు ఎదురుచూస్తున్నారు. స్వామీజీ సూచనల మేరకే దేవాదాయశాఖ ఆలయ పునర్ నిర్మాణ విషయంలో మాస్టర్‌ప్లాన్ బ్లూప్రింట్ సిద్ధం చేసింది. ఇందులో పిల్లర్లతో నిర్మాణం చేపడుతున్నట్లు భక్తులు చర్చించుకుంటున్నారు. ఇదే కొనసాగితే రాజన్న ఆలయ ఆధ్యాత్మికతకు భంగం కలిగే అవకాశం ఉందని భక్తులు పేర్కొంటున్నారు. అలాగే ప్రాచీనతకు అద్దం పట్టినట్లు ఉండే రాజన్న ఆలయ రూపురేఖలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. యాదాద్రి ఆలయాన్ని ఆధ్యాత్మికతకు అద్దం పట్టేలా నిర్మించారు. అంతకంటే పురాతన చరిత్ర గల రాజన్న ఆలయాన్ని అలాంటి శైలిలోనే నిర్మాణం చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. కాకతీయుల కాలం నాటి ప్రాచీన ఆలయానికి ఆధునిక పిల్లర్లు కట్టి, వాటికి రాతి పలకలు అద్దితే నాణ్యత ఎంతకాలం ఉంటుందనే విషయంపైనా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆలయ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ రాజేశ్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. కాంక్రీట్ పిల్లర్లతో మండప నిర్మాణం వాస్తవమేనని, ఆ పిల్లర్లకు రాతి పలకలు తొడుగుతామన్నారు. దీని నాణ్యత చాలాకాలం ఉంటుందని స్పష్టం చేశారు.
రాజన్న ఆలయ పునర్నిర్మాణం జరిగే సమయంలో భక్తులకు దర్శన భాగ్యం కలిగేనా లేక నిలిపివేస్తారా? అని అనుమానాలు ఉన్నాయి. దేవాదాయశాఖ అధికారులు నిర్మాణ సమయంలో స్వామివారికి ఏకాంత సేవలు మాత్రమే కొనసాగిస్తామని స్పష్టం చేయడంతో భక్తులకు రాజన్న దర్శనం కలిగేనా అనే అపోహలు నెలకొన్నాయి. నిర్మాణ సమయంలో భక్తులకు భీమేశ్వరస్వామి ఆలయంలో దర్శనాలు ఉంటా యని, ఉత్సవ విగ్రహాలను మూడు రోజుల క్రితమే తరలించారు. కోడెమొక్కులు కూడా భీమేశ్వరాలయంలోనే ఏర్పాటు చేశారు. ఈ విషయంపై బీజేపీ నాయకులు భక్తులకు రాజన్న ఆలయం నిర్మాణ సమయంలో దర్శన అవకాశం కల్పించాలని ఆందోళన చేస్తున్నారు. దీనిపై ఆలయ ఈవో రమాదేవి ఆలయం మూసివేత ఉండదని, ఆలయంలో జరిగే ఏకాంత పూజలు యథావిధిగా కొనసాగుతాయని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ యాదాద్రి కానీ, కాణిపాకం ఆలయంలో గానీ పునర్నిర్మాణ విషయంలో భక్తులకు దర్శన సౌకర్యం కల్పించారని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. ఇక్కడ అందుకు విరుద్ధంగా దర్శనాలు నిలిపివేయడం సరికాదంటున్నారు. మేడారం సమ్మక్క జాతర సందర్భంగా ముందుగా వేములవాడ రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ.. అని ఇలాంటి సమయంలో దర్శనం విషయంలో గందరగోళం కలిగించే ప్రకటనలు సరికాదని హితవు పలుకుతున్నారు.

రాజన్న మండపం!