
అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం
● చెట్టును ఢీకొన్న కారు.. ముగ్గురి పరిస్థితి విషమం
మెట్‌పల్లిరూరల్(కోరుట్ల): మెట్‌పల్లి మండలం మారుతినగర్ శివారులో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురికి తీవ్రగాయాలు కాగా, వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. వివరాలు.. కోరుట్ల పట్టణానికి చెందిన అవేజ్, మౌలానా, అమెర్, ఫయాజ్, సైఫ్, పుర్‌ఖాన్, కై ఫ్ అనే యువకులు కారులో కోరుట్ల నుంచి మెట్‌పల్లి వైపు వెళ్తున్నారు. మారుతినగర్ శివారులో జాతీయ రహదారిపై కారు అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. దీంతో కారులోని ఏడుగురు గాయాలపాలు కాగా మొదట మెట్‌పల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందజేశారు. వీరిలో అవేజ్, మౌలానా, అమెర్ పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు కరీంనగర్ ఆసుపత్రికి రెఫర్ చేయగా అక్కడ చికిత్స అందిస్తున్నారు. మెట్‌పల్లి ఎస్సై కిరణ్‌కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు.
రెస్టారెంట్ సిబ్బందిపై దాడి
హుజూరాబాద్: పట్టణంలోని కరీంనగర్ రోడ్డులో ఉన్న నిర్వహణ రెస్టారెంట్ సిబ్బందిపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. హోటల్ నిర్వాహకుల వివరాల ప్రకారం.. హోటల్ మూసివేసే సమయంలో ముగ్గురు వ్యక్తులు భోజనం చేయడానికి వచ్చారు. సిబ్బంది వారికి భోజనం వడ్డించారు. అరగంట దాటినా వెళ్లకపోవడంతో సిబ్బంది హోటల్ మూసివేస్తున్నామని తెలిపారు. ఆగ్రహానికి గురైన ఆ ముగ్గురు తమ అనుచరులకు ఫోన్ చేసి హోటల్‌కు రమన్నారు. క్షణాల్లోనే పది మంది వరకు వచ్చి హోటల్ సిబ్బందిపై దాడి చేశారు. చరణ్, అనిత, సాయికి గాయాలయ్యాయి. బాధితులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
ఎస్సారెస్పీ 21 గేట్లు ఎత్తివేత
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద వస్తుండడంతో ప్రాజెక్టు 21 గేట్లు ఎత్తి 65,604 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 75,394 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ప్రాజెక్టు నుంచి ఆ మేరకు వివిధ మార్గాల ద్వారా బయటకు విడుదల చేస్తున్నారు. కాకతీయకాలువకు 4,000 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4,000, సరస్వతి కెనాల్‌కు 650, లక్ష్మి కెనాల్‌కు 200, అలీసాగర్ ఎత్తిపోతల పథకానికి 180, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం