
ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
● మాట్లాడుకుందామని పిలిచి మర్డర్‌కు ప్లాన్ ● సెంటినరీకాలనీలో యువకుడి దారుణ హత్య
రామగిరి(మంథని): పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీకాలనీలో కోట చిరంజీవి(35) శుక్రవారం దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. రామగిరి మండల సమాఖ్యలో పనిచేస్తున్న కమాన్‌పూర్ మండలం పెంచికల్‌పేట గ్రామానికి చెందిన ఓ మహిళ, పోతనకాలనీలో మీ సేవా నిర్వాహకుడు, రామగుండం మండలం న్యూ మారేడుపాక గ్రామానికి చెందిన కోట చిరంజీవి క్లాస్‌మేట్స్. వీరికి గతంలోనే వివాహాలు జరిగాయి. ఇద్దరికీ సంతానం కూడాఉన్నారు. చిరంజీవి భార్య 2019లో చనిపోయింది. ఇదిలా ఉండగా.. ఎస్‌బీఐ సర్వీస్ ప్రొవైడర్‌కు సంబంధించి వివిధ అంశాలు నేర్చుకునేందుకు పోతనకాలనీలోని మీసేవలోని చిరంజీవి వద్దకు వెళ్తోంది. ఈక్రమంలో తను ప్రేమిస్తున్నానని, పిల్లలు, భర్తను వదిలి వస్తానని, పెళ్లి చేసుకోవాలని ఆ మహిళ కొంతకాలంగా చిరంజీవిని వేధిస్తోంది. ఇలాచేస్తే తన పరువు పోతుందని చిరంజీవి వారిస్తూ వస్తున్నాడు. అయినా ఆమె వినలేదు. ప్రవర్తన మార్చుకోలేదు. శుక్రవారం మధ్యాహ్నం కూడా చిరంజీవికి ఫోన్‌చేసి మాట్లాడుకుందామని సెంటినరీకాలనీలోని తను పనిచేసే కార్యాలయానికి పిలిపించింది. విషయాన్ని తన భర్త పొలవేన కుమార్, సోదరుడు అనవేన నరేశ్, పిడుగు చందు, అనవేన మల్లయ్యకు తెలియజేసింది. వారు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఆమెతో మాట్లాడుతున్న చిరంజీవిపై కుమార్, నరేశ్ ఇనుప రాడ్‌తో తలపై బలంగా కొట్టాడు. దీంతో తీవ్రగాయాలై చిరంజీవి అక్కడికక్కడే కుప్పకూలి మృతి చెందాడు. మృతుడి సోదరుడు కోట రాంచరణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. సంఘటన స్థలాన్ని గోదావరిఖని ఏసీపీ రమేశ్, మంథని సీఐ రాజు పరిశీలించారు. నిందితులు పారిపోతుండగా రామగిరి పోలీసులు అదుపులో తీసుకున్నారని సమాచారం.