
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండలం మాన్వాడ ఇసుక రీచ్ నుంచి అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసేందుకు ప్రయత్నించిన ఐదు ట్రాక్టర్లను శుక్రవారం పట్టుకొని పోలీస్‌స్టేషన్‌కి తరలించి కేసు నమోదు చేసినట్టు ఎస్సై రమాకాంత్ తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ఎస్సై రమాకాంత్ హెచ్చరించారు.
బైక్, ఆటో ఢీకొని ఇద్దరికి గాయాలు
వేములవాడరూరల్: బైక్, ఆటో ఢీకొన్న సంఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడ రూరల్ మండలం నూకలమర్రి గ్రామానికి చెందిన సూరం రమేశ్ తన అమ్మమ్మ కిష్టమ్మతో నూకలమర్రి నుంచి బైక్‌పై వేములవాడకు వస్తుండగా, వేములవాడ నుంచి నూకలమర్రి వైపు వెళ్తున్న ఆటో అతివేగంగా ఢీకొంది. సంఘటనలో రమేశ్, కిష్టమ్మకు గాయాలు కావడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆటో నడుపుతున్న వాసాల రమేశ్‌పై కేసు నమోదు చేసినట్లు వేములవాడ రూరల్ ఎస్సై వెంకట్రాజం తెలిపారు.
కేసు నమోదు
జ్యోతినగర్: ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు ఆవరణలో నిర్మితమవుతున్న సోలార్ ప్లాంటులో జరిగిన ప్రమాదంలో వలస కార్మికుడి మృతిపై ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. గురువారం జరిగిన ప్రమాదంలో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శివ దయాల్ రావత్(23) మృతి చెందాడు. హైడ్రా డ్రైవర్ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగి రావత్ మృతి చెందినట్లు మృతుడి బావమరిది సంజయ్‌లాల్ ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై టి.ఉదయ్‌కిరణ్ తెలిపారు.