
మెటాఫండ్ ప్రో నిందితుడి అరెస్ట్
● రూ.లక్ష నగదు, ల్యాప్‌టాప్, బ్యాంక్ ఖాతాలు స్వాధీనం
జగిత్యాలక్రైం: మెటాఫండ్ ప్రో యాప్‌లో పెట్టుబడి పెడితే మూడింతల లాభాలు వస్తాయని మోసాలకు పాల్పడిన నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. జగిత్యాల పట్టణానికి చెందిన కస్తూరి రాకేశ్‌కుమార్ మెటా ఫండ్ ప్రో యాప్‌ను క్రియేట్ చేసి రూ.లక్ష పెట్టుబడి పెడితే రూ.3 లక్షలు వస్తాయని, ఎక్కువ మందిని అందులో జాయిన్ చేస్తే డబ్బు సంపాదించడంతో పాటు, విదేశీ యాత్రలు ఉచితంగా వెళ్లిరావచ్చని, గొలుసుకట్టు వ్యాపారంతో పెట్టుబడులు పెట్టించాడు. కొడిమ్యాలకు చెందిన ముగ్గురి నుంచి రూ.20 లక్షలు వసూలు చేసి, మూడింతలు లాభం వస్తుందని నమ్మించి మోసం చేశారు. దీంతో బాధితులు కొడిమ్యాల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా గురువారం ఏ2 సింగిరెడ్డి తిరుపతిరెడ్డి, ఏ3 వీరబత్తిని రాజు, శుక్రవారం ఏ1 రాకేశ్‌ను అరెస్ట్ చేసి అతడి నుంచి ల్యాప్‌టాప్, రూ.లక్ష నగదు, బ్యాంక్ పాస్‌బుక్‌లు, ఏటీఎం క్రెడిట్‌కార్డులు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. గొలుసుకట్టు వ్యాపారం పేరిట మోసం చేసే వారి మాటలను ప్రజలు నమ్మవద్దన్నారు. కార్యక్రమంలో జగిత్యాల డీఎస్పీ రఘుచందర్, మల్యాల సీఐ రవి, కొడిమ్యాల ఎస్సై సందీప్ పాల్గొన్నారు.