
వెండి పోగులతో పట్టు పీతాంబరం
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లా కు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ చేనేత మగ్గంపై శతాబ్ది కాలం నాటి పట్టుపీతాంబరం చీరను నేశాడు. మెదక్ జిల్లా రామాయంపేట స్వప్న అనే మహిళ ఆర్డర్ మేరకు మళ్లీ పూర్వకాలపు పట్టుపీతాంబరాన్ని పునర్ సృష్టించాడు. 60 రోజుల పాటు శ్రమించి ఈ చీరను నేశాడు. చీర బరువు 660 గ్రాములు ఉంటుంది. ఇందులో 362 గ్రాములు వెండి ఉపయోగించి నేశాడు. చీర పొడువు 5.50 మీటర్లు కాగా.. జాకెట్‌తో కలిపి 6.30 మీటర్ల పొడువు ఉంటుంది. మామూలుగా చీర రెండు పక్కల అంచులు రన్నింగ్‌లో వస్తుంది. కానీ ఈ చీరలో బార్డర్ బుటా, మీనా వర్క్ అన్నీ కూడా చేతితో పెట్టి వేయడం విశేషం. శుక్రవారం రామాయంపేటకు చెందిన స్వప్నకు పట్టు పీతాంబరం చీరను అందించాడు. చేనేత మగ్గంపై ప్రయోగాలు చేస్తున్న హరిప్రసాద్ తాజాగా వందేళ్ల కిందటి పట్టుపీతాంబరాన్ని వెండిపోగులతో నేయడం విశేషం.