
బాలికల్లో ఆత్మవిశ్వాసం నింపాలి
సిరిసిల్ల: బాలికల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ఉపాధ్యాయులు, అన్ని ప్రభుత్వ శాఖలు కృషి చేయాలని జిల్లా బాలల సంక్షేమ అధికారి కవిత అన్నారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవం పురస్కరించుకొని తంగళ్లపల్లి మండలం మండెపల్లి గురుకుల విద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడారు. అక్టోబర్ 11న జరుపుకునే అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతీవారం ఐసీపీఎస్ టీం ప్రతీ సంస్థలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. బాలికల హక్కులు, భద్రత, విద్య, ఆరోగ్యం, సమాన అవకాశాలు, సామాజిక ఎదుగుదల పట్ల చైతన్యవంతులను చేయాలని కోరారు. బాలల రక్షణ చట్టాలు, పోషణ–విద్య–భద్రత అంశాలపై వివరించారు. బాల రక్షభవన్‌లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆర్డినేటర్ స్రవంతి, ఎస్సై వినీతరెడ్డి, సైకియాట్రిస్టు శ్రీఅక్షయ్, స్కూల్ ప్రిన్సిపాల్స్ తెరిసా, రమేశ్, గగన్, భార్గవి, మౌనిక, రమణ, శ్యామల, ఏఎన్‌ఎం ఆశ వర్కర్లు, స్కూల్ సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
సిరిసిల్లటౌన్: మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుర్రం అశోక్ అన్నారు. బీవైనగర్‌లోని అమృత్‌లాల్ శుక్లా కార్మిక భవన్‌లో శుక్రవారం జరిగిన సిరిసిల్ల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ టౌన్ మహాసభలో మాట్లాడారు. పెండింగ్ పీఎఫ్ సమస్యను అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కోడం రమణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు మూషం రమేశ్, జిల్లా సహాయ కార్యదర్శి సూరం పద్మ, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కాసారపు శంకర్, సీఐటీయూ నాయకుడు జిందం కమలాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీ, మహిళా సబ్ కమిటీని ఎన్నుకున్నారు.

బాలికల్లో ఆత్మవిశ్వాసం నింపాలి