
బాలాలయంగా భీమన్న గుడి
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ఆలయ పరిసరాల్లో పలు భవనాలను కూల్చివేయగా.. అదే సమయంలో భీమన్నగుడిలో దర్శనాలకు ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవ చూపుతుండడంతో ప్రభుత్వం సైతం నిధులు మంజూరు చేస్తుంది. ఇప్పటికే మొదటి విడతగా రూ.76 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అలాగే రూ.35.25కోట్లతో నిత్యాన్నదానానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఈక్రమంలో రాజన్న ఆలయంలో భక్తుల దర్శనాలు నిలిపివేసి భీమన్నగుడిలో కొనసాగించేందుకు రూ.3.44కోట్లతో పనులు చేస్తున్నారు.
భీమన్న గుడిలో సౌకర్యాలు
ప్రధాన ఆలయం కూల్చివేసి.. విస్తరిస్తున్న సమయంలో బాలాలయంలో పూజలు కొనసాగుతాయి. ప్రధాన దేవత విగ్రహాన్ని తాత్కాలిక స్థలానికి (బాలాలయానికి) తరలిస్తారు. ఇక్కడే అన్ని పూజలు కొనసాగుతాయి. విస్తరణ సమయంలో భక్తులకు ఇబ్బంది కలుగుకుండా భీమేశ్వరస్వామి ఆలయంలో దర్శనాలు కొనసాగిస్తారు. ఇందుకు సంబంధించిన షెడ్లు, క్యూలైన్లు, ఇతర సౌకర్యాల పనులు జోరందుకున్నాయి.
వృషభ ధ్వజస్తంభాలు ఏర్పాటు
రాజన్నను దర్శించుకునే భక్తులు కోడెమొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీ. భక్తుల విశ్వాసానికి అనుగుణంగా భీమన్నగుడిలో కోడెమొక్కులు చెల్లించుకునేందుకు వీలుగా ఆలయ అధికారులు విజయ దశమి రోజున వృషభ ధ్వజస్తంభాలను ప్రతిష్ఠించారు.
మండపాలు, క్యూలైన్లు
రాజన్న నిత్యకల్యాణాలు, భక్తుల దర్శనాలు, వీఐపీల దర్శనాలు, ఆశీర్వచన మండపం, సత్యనారాయణ వ్రతాల మొక్కులు చెల్లించుకునేందుకు వీలుగా షెడ్ల పనులు చేపడుతున్నారు. భీమన్నగుడి పక్కనే ఉన్న శంకరమఠంలో అభిషేకం, అన్నపూజ సంకల్పం, ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించనున్నారు. నిత్యకల్యాణం, సత్యనారాయణ వ్రతాలు అన్నదానం పైఅంతస్తులో నిర్వహించనున్నారు.
తరలిన కార్యాలయాలు
రాజన్న ఆలయం వద్దనున్న కార్యాలయాలను భీమేశ్వర సదన్‌లోకి తరలించారు. ఈవో కార్యాలయం, ఇంజినీరింగ్, పీఆర్వో విభాగాలతోపాటు ప్రధాన విభాగాలను తాత్కాలికంగా సదన్‌లోకి మార్చేశారు. వేదపాఠశాల ప్రహరీని తొలగించి అందులోకి ప్రసాదాల తయారీ కేంద్రం, ముందటే ప్రసాదాల కౌంటర్లు, సదన్‌లోని క్యాంటీన్‌లోకి మెయిన్ గోదాంలను తరలించారు.
రూ.3.44 కోట్లతో సౌకర్యాలు
త్వరలోనే రాజన్న గుడిలో దర్శనాల నిలిపివేత
భీమన్న గుడిలోనే భక్తుల దర్శనాలు... ఉత్సవాలు
నగరేశ్వర స్వామి ఆలయంలో చండీహోమం
గాయత్రి మాతా దేవాలయంలో కుంకుమపూజలు