
అర్ధబలానికే ‘అగ్ర’తాంబూలం!
మొదటి విడతలో ఎంపీటీసీలు..
ఆర్థికంగా బలమైన అభ్యర్థుల వేటలో పార్టీలు
కులసంఘాలకు స్థానిక నేతల వల
గంపగుత్తగా ఓట్లకు ఎర
ఇప్పటికే ఒప్పందాలు.. డబ్బులు పంపిణీ
సిరిసిల్ల: స్థానిక సంస్థల ఎన్నికల వేడి పల్లెల్లో రాజుకుంటోంది. రాజన్నసిరిసిల్ల జిల్లాలో తొలివిడత ప్రాదేశిక పోరుకు గురువారం నోటిఫికేషన్ జారీకి అధికారులు సన్నద్ధమవుతున్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులను పోటీకి నిలపాలని పార్టీలు భావిస్తున్నాయి. సీనియారిటీతో సంబంధం లేకుండా ఖర్చుకు వెనకాడని అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తున్నాయి. జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లో అభ్యర్థుల వేటలో నేతలు పడ్డారు. మొదటి విడతలో ఏడు జెడ్పీటీసీ స్థానాలకు, 65 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి
మొదటి విడతలోనే మూడు ఎస్సీ స్థానాలు
జిల్ల జెడ్పీ చైర్మన్ స్థానాన్ని ఎస్సీ జనరల్‌కు కేటాయించడం.. కోనరావుపేట, వేములవాడరూరల్, ఇల్లంతకుంట మండలాల జెడ్పీటీసీ స్థానాలు ఎస్సీలకు రిజర్వు అయ్యాయి. ఆయా స్థానాల్లో గెలుపొందిన అభ్యర్థులు జెడ్పీ చైర్మన్ పీఠాన్ని దక్కించుకోనున్నారు. ఈ మూడు మండలాలకు మొదటి విడతలోనూ ఎన్నికలు జరుగనున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్న అభ్యర్థులను ఈ మూడు స్థానాల్లో బరిలో దింపాలని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యేల సతీమణులు, మాజీ ఎమ్మెల్యేలు సైతం ఆయా స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.
ముందే కులసంఘాలకు ఎర
యువజన సంఘాలు, కులసంఘాలు, మహిళా సంఘాల ఓట్లకు ముందే వల వేస్తున్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులకు డబ్బులు ఇస్తానంటూ ఓట్లు పొందేందుకు ఎత్తులు వేస్తున్నారు. కోనరావుపేట మండలంలోని ఓ పెద్ద గ్రామంలో ఓ కుల సంఘం నేత సంఘానికి రూ.3.80లక్షలు ఇచ్చేందుకు అంగీకరించి అందరూ తనకు మద్దతు తెలపాలని ఒప్పందం చేసుకున్నారు. సదరు కులసంఘానికి ఇప్పటికే రూ.లక్ష చెల్లించినట్లు సమాచారం. తంగళ్లపల్లి మండలంలోని ఓ గ్రామంలో ఎన్నికల్లో తనకు సహకరించాలని కోరుతూ ఊరిలో ఓ ఆలయ నిర్మాణానికి రూ.2.50లక్షలు, వైకుంఠరథానికి మరో రూ.2.50 లక్షలు చెల్లించినట్లు తెలిసింది.
అభివృద్ధికి హామీ..
గ్రామాల్లో ఎక్కువ ఓట్లు ఉన్న కుల సంఘాలను లక్ష్యంగా చేసుకుని మద్దతు కూడగట్టే పనిలో ద్వితీయస్థాయి నేతలు ఉన్నారు. ఎన్నికల్లో కుల సంఘాల మద్దతుతోనే ఓట్లను గంపగుత్తగా సాధించవచ్చని భావిస్తున్నారు. ఒక్కో ఇంటికి తిరిగి ఓట్లను సాధించడం ప్రస్తుతం ప్రతికూలంగా మారడంతో కులసంఘాలతో సమావేశం నిర్వహించి సంఘ భవనాలకు హామీలు ఇస్తూ ఓట్లు సాధించే పనిలో పడ్డారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన రాజకీయ పార్టీల నేతలు పల్లెల్లో పాగా వేస్తున్నారు.
మండలం స్థానాలు పోలింగ్
కేంద్రాలు
బోయినపల్లి 11 60
చందుర్తి 10 54
రుద్రంగి 5 27
వేములవాడ అర్బన్ 6 36
వేములవాడ రూరల్ 7 40
కోనరావుపేట 12 70
ఇల్లంతకుంట 14 90