
తీర్పు ఏమొస్తుందో..
స్థానిక సంస్థల ఎన్నికలపై సందిగ్ధం
రిజర్వేషన్లపై టెన్షన్
హైకోర్టు వైపు.. నేతల చూపు
నేడు హైకోర్టులో విచారణ
సిరిసిల్ల: స్థానిక సంస్థల ఎన్నికలపై గతంలో ఎన్నడూ లేని ఉత్కంఠ కొనసాగుతోంది. ఈసారి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమైంది. ఈ మేరకు ‘స్థానిక’ రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. దీన్ని సవాల్ చేస్తూ పలువురు సుప్రీంకోర్టు, హైకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో పిటిషన్‌ను కొట్టివేయడంతో హైకోర్టు విచారణకు ప్రా ధాన్యత ఏర్పడింది. బుధవారం హైకోర్టులో విచారణ జరుగనుండగా, రాజకీయ నేతల అందరి చూపు కోర్టు వైపే ఉంది. ఎన్నికలు ఇప్పుడు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయా..? వాయిదా పడుతాయా అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ప్రకటించిన రిజర్వేషన్లకు అనుగుణంగా జిల్లాలోని ఆయా ప్రాంతాల్లోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికలకు సిద్ధమయ్యారు. కోర్టు తీర్పు ఎలా ఉంటుందో అనే సందిగ్ధం నెలకొంది.
ఎస్సీలకు జెడ్పీ పీఠం
జిల్లా వ్యాప్తంగా 12 జెడ్పీటీసీ స్థానాలున్నాయి. జెడ్పీ చైర్మన్ స్థానాన్ని ఎస్సీలకు కేటాయించారు. 12 స్థానాల్లో ఎస్టీలకు 1, ఎస్సీలకు 3, బీసీలకు 5, జనరల్‌కు 3 కేటాయించారు. ఇందులో రుద్రంగి ఎస్టీ జనరల్, ఇల్లంతకుంట ఎస్సీ మహిళ, కోనరావుపేట ఎస్సీ జనరల్, వేములవాడరూరల్ ఎస్సీ జనరల్, ముస్తాబాద్ బీసీ మహిళ, వేములవాడ అర్బన్ బీసీ మహిళ, బోయినపల్లి బీసీ జనరల్, గంభీరావుపేట బీసీ జనరల్, తంగళ్లపల్లి బీసీ జనరల్, ఎల్లారెడ్డిపేట జనరల్ మహిళ, చందుర్తి జనరల్, వీర్నపల్లి జనరల్‌కు కేటాయించారు. దీంతో జెడ్పీ చైర్మన్ అయ్యే చాన్స్ కోనరావుపేట, ఇల్లంతకుంట, వేములవాడ రూరల్ స్థానాల్లో ఎన్నికయ్యే ఎస్సీ అభ్యర్థులకు వస్తుంది. ఈ మేరకు ఆయా స్థానాల్లో ముఖ్యనాయకులు పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మిగతా మండలాల్లో పోటీ చేసే అభ్యర్థులు సైతం జెడ్పీ వైస్ చైర్మన్ స్థానాన్ని దక్కించుకోవాలని ఆశిస్తున్నారు.
ఎంపీపీ పీఠాలపై గురి
జిల్లాలో ఎంపీటీసీగా విజయం సాధించి ఎంపీపీగా ఎన్నిక కావాలని పలువురు నాయకులు ఆశిస్తున్నారు. జిల్లాలో 12 ఎంపీపీ స్థానాల్లో రుద్రంగి ఎస్టీ జనరల్, ముస్తాబాద్ ఎస్సీ మహిళ, కోనరావుపేట ఎస్సీ జనరల్, వేములవాడ రూరల్ ఎస్సీ జనరల్‌కు కేటాయించారు. ఇల్లంతకుంట, బోయినపల్లి బీసీ మహిళ, గంభీరావుపేట, వేములవాడ అర్బన్, ఎల్లారెడ్డిపేట మండలాలను బీసీ జనరల్‌కు కేటాయించారు. వీర్నపల్లి మహిళా జనరల్, చందుర్తి, తంగళ్లపల్లి మండలాలు జనరల్‌కు కేటాయించారు. 123 ఎంపీటీసీ స్థానాలకు గాను ఎస్టీలకు 7, ఎస్సీలకు 25, బీసీలకు 56, జనరల్‌కు 35 స్థానాలు కేటాయించారు.
ఊరిలో చక్రం తిప్పాలని..
జిల్లా వ్యాప్తంగా 260 గ్రామపంచాయతీలు ఉండగా.. సర్పంచ్ స్థానాలను ఆయా వర్గాలకు రిజర్వేషన్లు ప్రకటించారు. ఎస్టీలకు 30, ఎస్సీ 53, బీసీ 101, జనరల్ 76 స్థానాలను కేటాయించారు. గ్రామస్థాయిలో కీలకమైన సర్పంచ్ స్థానాన్ని దక్కించుకునేందుకు పలువురు యువకులు ముందుకు వస్తున్నారు. జిల్లాలో 2,268 వార్డు సభ్యుల స్థానాలు ఉండగా.. ఎస్టీ మహిళ 108, ఎస్టీ జనరల్ 121, ఎస్సీ మహిళ 182, ఎస్సీ జనరల్ 261 స్థానాలు కేటాయించారు. బీసీ మహిళ 388, బీసీ జనరల్ 520, జనరల్ మహిళ 287, జనరల్‌గా 401 స్థానాలు కేటాయించారు. ఆయా స్థానాల్లో వార్డు సభ్యులుగా విజయం సాధించి మెజార్టీ వార్డు సభ్యుల మద్దతుతో ఉప సర్పంచ్ స్థానాన్ని దక్కించుకోవాలని పలువురు భావిస్తున్నారు.
ఊరూరా విందు రాజకీయాలు
జిల్లా వ్యాప్తంగా ‘స్థానిక’ ఎన్నికల చర్చలు జోరుగా సాగుతున్నాయి. కులసంఘాల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే ఊరూరా విందు రాజకీయాలు పసందుగా సాగుతున్నాయి. స్థానిక ఎన్నికలపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుండగా ఏం తేలుతుందో ఉత్కంఠగా మారింది.