
ప్రణాళిక ప్రకారం ఆలయ విస్తరణ పనులు
వేములవాడ: వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ, అభివృద్ధి పనులు ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలని కలెక్టర్ హరిత ఆదేశించారు. మంగళవారం ఆలయ చైర్మన్ చాంబర్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆలయ పనులపై రూపొందించిన నమూనాను ఆర్కిటెక్ట్ సూర్యనారాయణమూర్తి కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆలయ విస్తరణకు సంబంధించి పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పనులు నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్‌ను సూచించారు. మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరకు ముందు రాజన్నను భక్తులు దర్శించుకునే ఆచారం ఉండడంతో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈనెలలో శృంగేరి పీఠాధిపతులు రానున్న సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులుంటే యంత్రాంగం దృష్టికి తీసుకురావాలన్నారు. అంతకుముందు రాజన్నను కలెక్టర్ దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఈవో రమాదేవి, ఏఈవో శ్రవణ్, అశోక్, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు.
భీమేశ్వర ఆలయంలో పనులు పరిశీలన
భీమేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్థం అభిషేకం, అన్నపూజ, కోడె క్యూలైన్లు తదితర ప్రదేశాలను కలెక్టర్ పరిశీలించారు. పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ సీఈ రాజేశ్వర్‌రెడ్డి, ఈఈ నరసింహాచారి, మున్సిపల్ కమిషనర్ అన్వేశ్, తహసీల్దార్ విజయప్రకాశ్‌రావు, వీటీఏడీఏ సెక్రటరీ అన్సార్ తదితరులు పాల్గొన్నారు.