
డిగ్రీ కళాశాల స్థలం కబ్జా
● ఏళ్లుగా పట్టించుకోని అధికారులు ● క్రమంగా ఆక్రమిస్తున్న ● ఉన్నతాధికారులకు ఫిర్యాదు
వేములవాడఅర్బన్: అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలంలో కబ్జాలపర్వం కొనసాగుతోంది. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ఏర్పాటైన కాలేజీ స్థలం కాలక్రమేన ఆక్రమణలకు గురవుతోంది. కాలేజీకి చుట్టుపక్కల నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారే తమ సామాజిక అవసరాల కోసం ఆక్రమించేస్తున్నారు. ఈ విషయం ఇటీవల వసతిగృహం నిర్మాణానికి స్థలాన్ని జిల్లా అధికారులు పరిశీలించిన సమయంలో వెలుగుచూసింది.
1987లో 25 ఎకరాలు
వేములవాడ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను 1987లో ఏర్పాటు చేశారు. చంద్రగిరి గ్రామపంచాయతీ పరిధిలోని తెట్టకుంట రెవెన్యూలోని సర్వే నంబర్ 38 కేకేలో 25 ఎకరాల భూమిని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు కేటాయించారు. కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిని ఆనుకుని డిగ్రీ కాలేజీని నిర్మింంచారు. విశాలమైన మైదానం ఉంది. అయితే భవన నిర్మాణ సమయంలో కాలేజీకి ముందు మాత్రమే ప్రహరీ నిర్మించారు. వెనుకభాగం, పక్క భాగం ప్రహరీ లేకపోవడంతో ఆక్రమణలకు గురవుతుంది.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 25 తరగతి గదులు ఉన్నాయి. డిగ్రీ కళాశాలలో మొత్తం 190 మంది విద్యార్థులు చదువుతున్నారు. 2021లో ఇదే కళాశాల భవనంలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్ కళాశాలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. డిగ్రీ కళాశాల తరగతి గదుల నుంచి 15 గదులను జేఎన్టీయూ కాలేజీకి అప్పగించారు. దీంతో రెండు కళాశాలలకు ఇరుకుగా మారడంతో విద్యార్థులు ఇబ్బందిపడుతున్నారు. ఒక సంవత్సరం మాత్రమే తాత్కలికంగా నడుస్తుందన్న జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ నాలుగేళ్లుగా ఇక్కడే కొనసాగుతోంది.
ఆక్రమణల్లో స్థలం
డిగ్రీ కళాశాల స్థలానికి ప్రహరీ లేకపోవడంతో ఆక్రమణలకు గురవుతోంది. కళాశాల వెనుక భాగం చిన్నగా బండరాళ్లు ఉండడంతో ఓ సామాజికవర్గానికి చెందిన వారు ఆలయాన్ని నిర్మించారు. కళాశాల భవనానికి పక్క భాగం ప్రహరీ లేకపోవడంతో ఆ ప్రాంతంలోని కాలనీవాసులు సమాధులు ఏర్పాటు చేశారు. ఎలాంటి గోడ లేకపోవడంతో కొందరు ఆకతాయిలకు రాత్రి, పగలు అడ్డాగా మారిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ప్రభుత్వ డిగ్రీ కళాశాల స్థలాన్ని కాపాడాలని విద్యార్థులు, స్థానికులు కోరుతున్నారు.
మహిళ వసతిగృహం
డిగ్రీ కళాశాల ఆవరణలో ఇటీవల కళాశాలకు పీఎం ఉషా(ప్రధానమంత్రి ఉచ్చతర శిక్షా అభియాన్)లో రూ.10కోట్లతో మహిళ వసతిగృహం నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. అన్ని హంగులతో కూడిన వసతిగృహం ఏర్పాటు చేయనున్నారు. వసతిగృహంలో సుమారుగా 300 మందికి వసతి కల్పించనున్నారు.

డిగ్రీ కళాశాల స్థలం కబ్జా