
గుడి విస్తరణ షురూ..
● రూ.150కోట్లతో రాజన్న ఆలయ పనులు ● రూ.3.40కోట్లతో భీమన్నగుడిలో క్యూలైన్లు, షెడ్ల ఏర్పాటు ● ఓ వైపు కూల్చివేతలు.. మరోవైపు నిర్మాణాలు
వేములవాడ: రాజన్న ఆలయ విస్తరణ పనులు వేగం అందుకున్నాయి. శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతుండడంతో వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం గుడిని విస్తరించాలని నిర్ణయించింది. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డి గత నవంబర్ 20న రూ.150 కోట్ల పనులకు భూమిపూజ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర దేవాదాయశాఖ, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ అధికారులు పనులు వేగవంతం చేశారు. ఆలయం వద్ద పాత నిర్మాణాలు కూల్చివేస్తుండగా.. భీమన్న గుడి వద్ద భక్తులకు సౌకర్యాల కల్పన పనులకు శ్రీకారం చుట్టారు. రాజన్న ఆలయాన్ని 35 ఎకరాల్లో విస్తరించే పనులు మొదలుపెట్టారు. రాజన్న గుడి వద్ద భారీ క్రేన్లు, జేసీబీలతో కూల్చివేతలు కొనసాగుతుండగా.. భీమన్నగుడి వద్ద క్యూలైన్ల ఏర్పాటుకు వెల్డింగ్ పనులు చేస్తున్నారు. త్వరలోనే రాజన్నగుడిలో దర్శనాలు నిలిపివేసి భీమన్నగుడిలో కొనసాగించనున్నారు.
మార్పులు ఇలా..
● ప్రసాదాల తయారీ గోదాంను వేదపాఠశాలలోకి మారుస్తున్నారు.
● వేదపాఠశాలనుభగవంతరావునగర్‌లోని శివస్వాముల భవనంలోకి తరలిస్తున్నారు.
● కల్యాణాలు, సత్యనారాయణవ్రతాలు శృంగేరి మఠంలోని ప్రత్యేక షెడ్లలో నిర్వహిస్తున్నారు.
● ప్రధాన గోదాంను భీమేశ్వరసదన్‌లోని క్యాంటీన్‌ను ఖాళీ చేయించి అందులోకి మార్చనున్నారు.
● ఆలయ ఎస్టాబ్లిష్‌మెంట్ ఆఫీస్, పీఆర్‌వో, ఈవో ఆఫీస్, ఇంజినీరింగ్ విభాగాలను భీమేశ్వర సదన్‌లోని మొదటి అంతస్తు, విచారణ కార్యాలయంలోకి మార్చనున్నారు.
● రాజేశ్వరపురం వద్ద నిర్మించిన షెడ్డులోకి కల్యాణకట్ట, ఆ పక్కనే షవర్లు ఏర్పాటు చేసి భక్తుల స్నానాలకు అనుమతించనున్నారు.
● పార్వతీపురం వసతి గదుల వెనక నుంచి భక్తుల దర్శనాలకు క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నారు.
● ప్రస్తుత అన్నదానసత్రాన్ని యథావిధిగా కొనసాగించనున్నారు.
రాజన్న గుడి వద్ద కూల్చివేస్తున్న యంత్రాలు

గుడి విస్తరణ షురూ..