
వంతెన నిర్మించాలని ఒర్రె నీటిలో నిరసన
చందుర్తి(వేములవాడ): ఒర్రె ప్రాంతాల్లో రెండు వంతెనలు నిర్మించాలని మండలంలోని ఎన్గల్ గ్రామ శివారు ఒర్రె నీటిలో ప్రజాగొంతుక చీఫ్ పుప్పాల మోహన్ మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్గల్ గ్రామానికి చెందిన గీత కార్మికుల రేణుక ఎల్లమ్మ ఆలయం, పెద్దమ్మ ఆలయాలతో పాటు రైతుల పొలాలు, వైకుంఠధామం, డంపింగ్ యార్డు ఒర్రె అవతలి వైపు ఉన్నాయని పేర్కొన్నారు. వర్షాకాలంలో గ్రామస్తులు ఒర్రె దాటేందుకు ఇబ్బంది పడుతున్నారని, వంతెన నిర్మించాలని గతంలో అప్పటి ఎమ్మెల్యే రమేశ్‌బాబు, ప్రస్తుత ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌కు విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు.
సిరిసిల్ల: జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో బుధవారం ప్రజాపాలన దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాజరై జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. అంతకుముందు విప్, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బి గితే పోలీస్ గౌరవ వందనం స్వీకరిస్తారు. ఉదయం 9.40 నుంచి 10.07 గంటల వరకు ప్రజా పాలన వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వేములవాడ: వేములవాడ– సిరికొండ రోడ్డు నిర్మాణానికి రూ.23 కోట్ల నిధులు మంజూరైనట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మంగళవారం తెలిపారు. వేములవాడ నుంచి సిరికొండ రోడ్డు సుమారు 18 కిలోమీటర్లు ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ, ఇందుకు కృషి చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి నియోజకవర్గ ప్రజల పక్షాన విప్ ఆది ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
టెక్నికల్ కోర్సులకు శిక్షణ
సిరిసిల్ల/సిరిసిల్లకల్చరల్: జిల్లా కేంద్రంలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్స్, నాలెడ్జ్ (టాస్క్) ప్రాంతీయ కేంద్రంలో పలు సాంకేతిక కోర్సులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి నీల రాఘవేందర్ ప్రకటనలో తెలిపారు. జిల్లా గ్రంథాలయ భవనంలోని ప్రాంతీయ కేంద్రంలో జావా వెబ్ డెవలప్‌మెంట్, పైతాన్ సి, సీ ప్లస్ 2, హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, జావా స్క్రిప్ట్, ట్యాలీ విత్ జీఎస్టీ, అప్టిట్యూడ్ రీజనింగ్ సాఫ్ట్ స్కిల్స్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కనీసం డిగ్రీ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీయువకులు ఈ నెల 20లోపు టాస్క్ ప్రాంతీయ కేంద్రలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న యువతకు మంచి ప్యాకేజీలతో ఉపాధి అవకాశాలుంటాయని, పూర్తి వివరాలకు 70755 22671, 95333 08928 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
సిరిసిల్ల: జిల్లాలో మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. అత్యధికంగా కోనరావుపేటలో 63.0 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. రుద్రంగిలో 10.7 మి.మీ, చందుర్తి 32.6, వేములవాడ రూరల్ 16.2, సిరిసిల్ల 27.6, వీర్నపల్లి 7.0. వేములవాడ 27.6, ఎల్లారెడ్డిపేట 38.4, గంభీరావుపేట 24.0, ముస్తాబాద్ 53.7, తంగళ్లపల్లి 16.8, ఇల్లంతకుంట 24.0, బోయినపల్లిలో అత్యల్పంగా 1.0 మిల్లీ మీటర్ల వర్షం నమోదైంది. జిల్లాలో సగటు వర్షపాతం 26.4 మిల్లీ మీటర్లు ఉంది.

వంతెన నిర్మించాలని ఒర్రె నీటిలో నిరసన