
పల్లెల్లో వానరదండు
కోనరావుపేట(వేములవాడ): తలుపు తెరిచి ఉంటే చాలు క్షణాల్లో ఇళ్లలోకి చొరబడి దొరికింది ఎత్తుకెళ్తున్నాయి. పెంకుటిళ్లపైకి ఎక్కి గూనపెంకులు పీకిపారేస్తున్నాయి. కూరగాయల తోటలు, పత్తిచేనులు చేతికిరాకుండా పోతున్నాయి. ఇవన్నీ కోతులమంద దాడితో పల్లెప్రజలు పడుతున్న కష్టాలు. కొన్నాళ్లుగా జిల్లాలోని పల్లెల్లో వందల కొద్ది కోతులు తిష్టవేసి ఉన్నాయి. పంటలను పాడు చేయడమే కాకుండా మనుషులపై దాడి చేసి గాయపరుస్తున్నాయి. కిష్కిందకాండతో పల్లెప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీ..ఇన్నీ కావు.
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి
గ్రామాల్లోకి చొరబడ్డ కోతులు ఇళ్లలోకి వచ్చి తినుబండారాలను ఎత్తుకెళ్తున్నాయి. అడ్డుకోబోయిన వారిపై దాడి చేస్తున్నాయి. పెంకుటిళ్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది. తినుబండారాలను ఎత్తుకెళ్తున్న కోతులు ప్యాకెట్ల నుంచి రాలిన గింజల కోసం గూనపెంకులను పీకి పడేస్తున్నాయి. పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తున్న విద్యార్థులపై దాడి చేస్తుండడంతో కోనరావుపేట మండలం కనగర్తిలో టీచర్లు కర్రలతో కాపలాగా ఉంటున్నారు. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులపై దాడికి దిగుతుండడంతో కర్రలు పట్టుకుని వెళ్తున్నారు.
● పంటలు నేలపాలు
గ్రామాల్లోని పంటలపై దాడి చేసి ధ్వంసం చేస్తున్నాయి. పత్తి, మొక్కజొన్న పంటలు నేలపాలవుతున్నాయి. రైతులు పంటలను కాపాడుకునేందుకు కర్రలతో కాపలా కాస్తున్నారు.
● నివారణ చర్యలు శూన్యం
గ్రామాల్లో పెరుగుతున్న కోతుల నియంత్రణ చర్యలు శూన్యంగానే ఉన్నాయి. కొన్ని గ్రామాల్లో కొండెంగను తీసుకొచ్చి తిప్పారు. తర్వాత వదిలేయడంతో కోతుల బెడద మళ్లీ మొదలైంది. కోతుల బెడద నివారించాలని కనగర్తి గ్రామస్తులు ఇటీవల జిల్లా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాను కలిసి విన్నవించారు.