
కెప్టెన్ సాబ్ త్యాగానికి సలాం
నేడు కెప్టెన్ రఘునందన్‌రావు 60వ వర్ధంతి
సిరిసిల్ల: దేశసరిహద్దుల్లో వీరోచితంగా పోరాడిన కెప్టెన్ రఘునందన్‌రావు 1965 సెప్టెంబరు 17న ఇండో–పాక్ యుద్ధంలో వీరమరణం పొందారు. సిరిసిల్ల పట్టణం చిన్నబోనాలకు చెందిన విజయ రఘునందన్‌రావు 60వ వర్ధంతి బుధవారం. కెప్టెన్ సాబ్ యాదిలో కథమిదీ.
ఏం జరిగిందంటే..
అది 1965 ఆగస్టు 28 శ్రీనగర్‌లో పాకిస్తాన్ స్థావరాలపై మాఫింగ్ ఆపరేషన్ చేస్తున్న క్రమం. పుణెలో ఉన్న కెప్టెన్ విజయరఘునందన్‌రావుకు పిలుపొచ్చింది. వెంటనే కశ్మీర్‌లోని చాంబ్‌జారిన సెక్షన్‌లో చేరిపోయారు. అక్కడ పాకిస్తాన్ సైనికులతో జరిగిన భీకరపోరులో రఘునందన్‌రావు వీరోచితంగా పోరాటం సాగించాడు. కెప్టెన్‌గా సైనికులకు మార్గదర్శకంగా ఉంటూ యుద్ధంలో ముందుకు సాగాడు. ఈ క్రమంలో రఘునందన్‌రావు మెడకు బుల్లెట్ గాయమైంది. వెంటనే అతన్ని ఢిల్లీలోని కంటోన్మెంట్‌కు విమానంలో తరలించారు. ఢిల్లీ చేరేలోగానే 1965 సెప్టెంబరు 17న వీర మరణం పొందారు. దేశం యావత్తు ఆ వేళ ఆయన వీరమరణానికి నివాళి అర్పించింది. భారత ప్రభుత్వం వీరచక్ర అవార్డుతో సత్కరించింది. ఆయన స్మారకార్థం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కెప్టెన్ రఘునందన్‌రావు రోడ్డు ఉంది. సిరిసిల్ల పాత బస్టాండులో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయన జీవిత చరిత్రను 7వ తరగతి తెలుగు వాచకంలో ‘చదవండి–తెలుసుకోండి’ శీర్షికతో పాఠ్యాంశమైంది. ఆయన పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఆదర్శం.

కెప్టెన్ సాబ్ త్యాగానికి సలాం