
ప్రాజెక్టులు జలకళ..
నిండుగా జలాశయాలు.. నిండని చెరువులు సగం చెరువుల్లో సగమైనా చేరని నీరు సాధారణ వర్షాలతో జిల్లాలో విభిన్న పరిస్థితులు
చెరువులు వెలవెల !
సిరిసిల్ల: జిల్లాలో సాధారణ వర్షపాతమే నమోదైంది. పొరుగు జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎగువమానేరు పొంగింది. అక్కడి నుంచి నీరు మిడ్‌మానేరుకు చేరడంతో గేట్లు ఎత్తి కరీంనగర్ ఎల్‌ఎండీకి తరలించారు. అంతేకాకుండా అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి, మల్కపేట రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. దీంతో జిల్లాలోని ప్రాజెక్టులు నిండుగా జలకళ సంతరించుకోగా.. చెరువులు, కుంటలు వెలవెలబోతున్నాయి. జిల్లాలో వర్షాధారిత, గొలుసు చెరువులు కావడంతో సాధారణ వర్షపాత పరిస్థితులతో చాలా చెరువుల్లోకి సగం కూడా నీరు రాలేదు. జిల్లాలోని చిన్ననీటి వనరులు చిన్నబోయి కనిపిస్తున్నాయి.
వేములవాడ ప్రాంతంలో నిండని చెరువులు
ఇల్లంతకుంట, బోయినపల్లి మండలాల్లోని చెరువుల్లో కొంతమేరకు నీరు వచ్చింది. సిరిసిల్ల ప్రాంత చెరువులు మాత్రం పూర్తిగా నిండి మత్తళ్లు దూకుతున్నాయి. వేములవాడ ప్రాంతంలో వర్షం సాధారణం కంటే తక్కువగా కురవడంతో చెరువులు, కుంటలు ఇంకా నిండలేవు. ఇల్లంతకుంట మండలంలో ఎక్కువ వర్షాలు పడ్డాయి. రుద్రంగి, వేములవాడరూరల్, సిరిసిల్ల పట్టణ ప్రాంతాల్లో పెద్దగా వర్షాలు లేవు. జిల్లాలో ఈ ఏడాది వర్షాలు భిన్నంగా ఉన్నాయి. మానేరు, మూలవాగులు పారని ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెద్దగా అభివృద్ధి చెందలేదు.
ఇది బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద మానేరునదిపై నిర్మించిన మధ్యమానేరు ప్రాజెక్టు. 26.55 టీఎంసీల నీటి నిల్వతో నిండుగా ఉంది. ఇక్కడి నుంచి ఇల్లంతకుంట మండలం అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్‌లోకి, కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. ఇటీవల భారీ వర్షాలతో ఎగువమానేరు పొంగడంతో 18 గేట్లు ఎత్తి దిగువ మానేరు(ఎల్‌ఎండీ)లోకి నీటిని వదిలారు.
ఇది గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఉన్న ఎగువమానేరు జలాశయం. 2 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిజాం కాలంలో నిర్మించారు. ఇటీవల కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో కురిసిన వర్షాలతో పాల్వంచ, కూడెల్లివాగుల ద్వారా నీరు వచ్చి చేరడంతో పూర్తిస్థాయిలో నిండి మత్తళ్లు పోస్తున్నాయి.
ఇది తంగళ్లపల్లి మండలంలోని తాడూరు పెద్దచెరువు. వర్షాలు బాగా పడితేనే ఈ చెరువు నిండుతుంది. కానీ జిల్లా వ్యాప్తంగా పెద్దగా వర్షాలు లేవు. సాధారణ వర్షపాతమే నమోదు కావడంతో తాడూరు పెద్దచెరువు సగమైనా నిండలేదు. ఒక్క తాడూరు చెరువే కాదు.. జిల్లా వ్యాప్తంగా చిన్ననీటి వనరులైన చెరువులు, కుంటల్లో నీరు పూర్తిగా చేరకపోవడంతో చెరువులు వెలవెలబోతున్నాయి. వర్షాకాలం ముగింపు దశకు చేరగా.. రువులు, కుంటలు నిండకపోవడంతో జిల్లాలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ప్రాజెక్టులు జలకళ..

ప్రాజెక్టులు జలకళ..