
బీఆర్‌ఎస్ అవినీతి బట్టబయలైతుంది
మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి
సిరిసిల్లటౌన్: పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలోని రూ.లక్ష కోట్లకు పైగా ప్రజాధనం అక్రమాలపై సీబీసీఐడీ విచారణ జరగాల్సిందేనని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, మైనింగ్ శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు రాగుల రాములు అధ్యక్షతన సిరిసిల్లలో బుధవారం నిర్వహించిన సకలజనుల ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి హాజరైన సందర్భంగా మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం అవినీతిని కల్వకుంట్ల కవితే బహిర్గతం చేస్తోందన్నారు. కాంగ్రెస్ హయాంలోనే గోదావరి నీటి వినియోగానికి ప్రాణహిత, ఎల్లంపల్లి ప్రాజెక్టులను తీర్చిదిద్దిందన్నారు. అప్పటికే రూ.11వేలు కోట్లు ఖర్చు చేయగా మరో రూ.24వేల కోట్లు పెడితే సరిపోయేదానికి.. రీడిజైనింగ్ అంటూ రూ.లక్ష కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. కేటీఆర్, కేసీఆర్ ఫామ్‌హౌస్‌లకు నీళ్లు తీసుకుపోవడానికే మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులు కట్టారన్నారు.
నాన్న చూపిన బాటలో..
నాన్న చూపిన బాటలో నడిచి, ప్రజాసేవకు పాటుపడతానని మంత్రి వివేక్ పేర్కొన్నారు. కార్మికశాఖ మంత్రిగా సిరిసిల్ల నేతకార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్ పదేండ్ల పాలనలో సిరిసిల్లలో సాండ్ మాఫియా రాజ్యమేలిందన్నారు. ఇసుక మాఫియా చేతిలో దళితులు ఇబ్బందులు పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రిని అన్నివర్గాలు, వివిధ పార్టీల నాయకులు సన్మానించారు. ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, ఏఎంసీ చైర్మన్ వెల్ముల స్వరూపరెడ్డి, ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, కత్తెర దేవదాసు, రాగుల జగన్, కాముని వనిత పాల్గొన్నారు. అంతకుముందు జిల్లాకు తొలిసారి విచ్చేసిన మంత్రి వివేక్‌కు కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బి గీతే పూలబొకేలు అందించి స్వాగతం పలికారు.
డీసీఎల్ ఆఫీస్ ఏర్పాటు చేయండి
సిరిసిల్లలో డీసీఎల్ ఆఫీస్ ఏర్పాటు చేయాలని కోరుతూ సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేశ్ మంత్రికి వినతిపత్రం అందించారు. ఇసుక ధర ట్రాక్టర్ ఒక్కంటికి రూ.7వేలు పెంచారని, ఇక్కడి ఇసుక సమస్యను పరిష్కరించాలని కోరారు.