
గర్భిణుల వివరాలు ఆన్‌లైన్ చేయాలి
● జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత
సిరిసిల్ల: జిల్లాలోని గర్భిణుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ఎస్.రజిత కోరారు. కలెక్టరేట్‌లోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో గురువారం పీహెచ్‌సీల వైద్యులు, ఆస్పత్రుల పర్యవేక్షకులతో సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్‌వో రజిత మాట్లాడుతూ ఎంసీహెచ్‌లో భాగంగా ప్రతీ గర్భిణి వివరాలు సేకరించి ఆన్‌లైన్‌లో విధిగా నమోదు చేయాలన్నారు. పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని, వెంటనే ఇంటికి పంపించకుండా అబ్జర్వేషన్‌లో ఉంచుకోవాలని సూచించారు. ప్రతీ మంగళ, శుక్రవారాల్లో డ్రైడే నిర్వహించాలన్నారు. వర్షాకాలంలో వచ్చే వ్యాధులపై ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఎంజెలినా ఆల్ఫ్రెడ్, వైద్యులు సంపత్, రామకృష్ణ, అనిత, నయిమా జహా పాల్గొన్నారు.