
పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటునందిస్తాం
● నాబార్డు ఏజీఎం జయప్రకాశ్
చందుర్తి(వేములవాడ): గ్రామీణ ప్రాంతాల్లో చిన్న, సన్నకారు రైతులు, మహిళలకు చిన్నపాటి పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేందుకు ఆర్థిక తోడ్పాటును అందిస్తామని నాబార్డు ఏజీఏం జయప్రకాశ్ పేర్కొన్నారు. మండలంలోని తిమ్మాపూర్‌లో నాబార్డు 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం వేడుకలు నిర్వహించారు. ఏజీఎం జయప్రకాశ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత రైతులను, మహిళలను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించామన్నారు. నాబార్డు డీడీఎం దిలీప్‌చంద్ర, నోడల్ అధికారి కృష్ణ, ప్రాజెక్టు మేనేజర్ సలీవుద్దీన్ పాల్గొన్నారు.
నేతకార్మికుల సమస్యలు పరిష్కరించాలి
సిరిసిల్లటౌన్: వస్త్ర పరిశ్రమలోని అన్ని రంగాల నేతకార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని పవర్‌లూమ్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూశం రమేశ్ కోరారు. సిరిసిల్లకు శనివారం విచ్చేసిన చేనేత, జౌళిశాఖ డైరెక్టర్ ఎన్.వెంకటేశ్వర్‌రావును కలిసి వినతిపత్రం అందించి మాట్లాడారు. కార్మికులకు రావాల్సిన యారన్ సబ్సిడీ డబ్బులు వెంటనే అందించాలని కోరారు. త్రిఫ్ట్, వర్కర్ టు ఓనర్ పథకాలను వెంటనే ప్రారంభించాలని, ఇతర సమస్యలను వివరిస్తూ వినతిపత్రాన్ని అందజేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ తదితరులున్నారు.
గ్రామాలను శుభ్రంగా ఉంచాలి
బోయినపల్లి(వేములవాడ): గ్రామాల్లో పరిశుభ్రత పాటించడంపై ప్రజలకు అవగాహన కల్పించాలని స్వచ్ఛ సర్వేక్షన్ కేంద్ర బృందం సభ్యులు అనూష, శిరీష పేర్కొన్నారు. మండలంలోని కోరెం, రామన్నపేట, స్తంభంపల్లి గ్రామాలను శనివారం సందర్శించారు. కోరెంలో చేపడుతున్న పరిశుభ్రత గురించి క్షేత్రస్థాయిలో పర్యటించారు. గ్రామపంచాయతీలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్బీఎం జిల్లా కో–ఆర్డినేటర్ సురేష్ మాట్లాడుతూ స్వచ్ఛసర్వేక్షన్ గ్రామీణ్‌లో భాగంగా జిల్లాలో 20 గ్రామాలు ఎంపికవగా 13 గ్రామాలు సందర్శించినట్లు తెలిపారు. ఎంపీడీవో బీమా జయశీల, ఎంపీవో శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి రవి ఉన్నారు.
పుణ్యక్షేత్రాల పర్యటనకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ
సిరిసిల్లటౌన్: కార్మికక్షేత్రం సిరిసిల్ల నుంచి యాదగిరిగుట్ట–సురేంద్రపురి–బంగారు శివలింగం–స్వర్ణగిరి టెంపుల్స్ దర్శనానికి స్పెషల్ డీలక్స్ బస్సును ఆదివారం నడుపుతున్నట్లు సిరిసిల్ల డీఎం ప్రకాశ్‌రావు తెలిపారు. ఆదివారం ఉదయం 5 గంటలకు సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుంచి డీలక్స్ బస్సు బయలుదేరి యాదగిరిగుట్ట, సురేంద్రపురి, బంగారు శివలింగం, స్వర్ణగిరి దేవాలయాల దర్శనానంతరం తిరిగి అదే రోజు రాత్రి సిరిసిల్లకు చేరుతుందని తెలిపారు. పెద్దలకు రూ.750, పిల్ల ల కు రూ.450 చార్జీ ఉంటుందని వివరించారు. వివరాలకు 90634 03971, 99592 25929, 73828 50611, 63041 71291, 94946 37598 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
ప్రభుత్వ పాఠశాలలకు ఇంటర్నెట్
● ఆదేశాలిచ్చిన విద్యాశాఖ సెక్రటరీ
సిరిసిల్లఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ బోర్డులతో విద్యాబోధన చేయడానికి అవసరమైన ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ సెక్రటరీ నికోలస్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని 101 పాఠశాలలకు ఇంటర్నెట్ కనెక్షన్ అందించేందుకు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి ఉన్న సదుపాయాలతో పాటు ఏదైనా సమస్య ఉంటే నిర్ణీత నమూనాలో సమాచారాన్ని అందించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటునందిస్తాం

పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటునందిస్తాం