
అకాల వర్షం.. తడిసిన ధాన్యం
సిరిసిల్ల/రుద్రంగి(వేములవాడ): వరుసగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రుద్రంగి మండలంలోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం తడిసిపోయింది. తేమశాతం వచ్చినా ధాన్యాన్ని సైతం తూకం వేయకపోవడంతో బుధ, గురువారాల్లో కురిసిన వర్షానికి ధాన్యం కుప్పల్లోకి వరదనీరు వచ్చి చేరింది. తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కంటతడి పెడుతున్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తూకం వేసిన ధాన్యం బస్తాలను సైతం మిల్లులకు తరలించకపోవడంతో తడిసి ముద్దయ్యాయి.
జిల్లా అంతటా వర్షాలు
రుద్రంగిలో అత్యధికంగా 47.1 మిల్లీమీటర్లు, చందుర్తిలో 31.8, వేములవాడరూరల్‌లో 19.6, బోయినపల్లిలో 22.8, వేములవాడలో 35.9, సిరిసిల్లలో 23.4, కోనరావుపేటలో 27.8, వీర్నపల్లిలో 30.5, ఎల్లారెడ్డిపేటలో 42.7, గంభీరావుపేటలో 29.6, ముస్తాబాద్‌లో 27.2, తంగళ్లపల్లిలో 33.5, ఇల్లంతకుంటలో 19.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా సగటు 30.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.