
మూడు కేజీబీవీలు అప్‌గ్రేడ్
● బోయినపల్లి, ఇల్లంతకుంట, వేములవాడ అర్బన్ మండలాల్లో ఇంటర్ తరగతులు ● ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభం
బోయినపల్లి(చొప్పదండి): జిల్లాలోని మరో మూడు కేజీబీవీలు కళాశాలలుగా అప్‌గ్రేడ్ కానున్నాయి. బోయినపల్లి, ఇల్లంతకుంట, వేములవాడ అర్బన్ మండలాల కేజీబీవీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ కోర్సులు అందించనున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు బోయినపల్లిలో ప్రచారం చేస్తున్నారు. ఒక్కో కళాశాలలో రెండు కోర్సులు, క్లాస్‌కు 40మంది విద్యార్థినులతో సీట్లు భర్తీ చేయనున్నారు. బోయినపల్లిలో బైపీసీ, ఎంఎల్‌టీ, ఇల్లంతకుంటలో ఎంపీసీ, బైపీసీ, వేములవాడఅర్బన్‌లో సీఈసీ, ఏఐ కోర్సులు ప్రవేశపెట్టారు. విద్యాబోధనకు కావాల్సిన ఫ్యాకల్టీని వచ్చే నెలలో నియామకం చేస్తారని అధికారులు తెలిపారు. విద్యార్థినులకు అవసరమైన వసతులు జూన్‌లోపు పూర్తి చేయనున్నారు. ‘బోయినపల్లి కేజీబీ వీ కళాశాలలో ఈ విద్యాసంవత్సరంలో ఇంటర్ మొదటి సంవత్సరానికి బైపీసీ, ఎంఎల్‌టీ ( మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్) కోర్సులు ప్రారంభిస్తున్నాం. కళాశాలలో చేరాలని ప్రచారం చేయడం జరుగుతోంది’ అని బోయినపల్లి కేజీబీవీ ఎస్‌వో లింగవ్వ తెలిపారు.