శ్రద్ధ లేదు.. శుద్ధి కాదు! | - | Sakshi
Sakshi News home page

శ్రద్ధ లేదు.. శుద్ధి కాదు!

May 10 2025 12:09 AM | Updated on May 10 2025 12:09 AM

శ్రద్

శ్రద్ధ లేదు.. శుద్ధి కాదు!

సిరిసిల్ల: సిరిసిల్ల మురికి నీరు ఇలా పట్టణ శివారులోని తుమ్మలకుంటలో కలుస్తుంది. అక్కడి నుంచి మానేరు వాగులో కలిసి మధ్యమానేరు జలాశయంలోకి చేరుతుంది. ఆ నీటినే మిషన్‌ భగీరథ ద్వారా శుద్ధిచేసి తాగునీరుగా జిల్లాలోని అన్ని జనవాసాలకు అందిస్తున్నారు. ఇలా చేయడం ప్రజారోగ్యానికి ఎప్పటికై నా ముప్పే అని భావించిన అధికారులు మురికి సమస్యను శాశ్వతంగా తొలగించేందుకు పట్టణ శివారులోని శాంతినగర్‌ వద్ద సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్‌టీపీ)ను ఏర్పాటు చేశారు.

పద్మనగర్‌లో లోపభూయిష్టంగా నిర్మాణం

పద్మనగర్‌ ప్రాంతంలో మురికి నీటిని శుద్ధి చేసేందు కు ఏర్పాటు చేసిన ఇంప్లూయెంట్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఈటీపీ) విఫలమైంది. మున్సిపల్‌, ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ లోపంతో రూ.1.98 కోట్లతో 2019లో నిర్మించిన మినీ ఈటీపీ ప్లాంటు పనికి రాకుండా పోయింది. మురికి కాల్వకు అడ్డంగా మురికి నీరు శుద్ధి అయ్యే విధంగా ఈటీపీ ప్లాంటును నిర్మించాల్సి ఉండగా.. నీరు కిందనుంచి వెళ్లిపోయే విధంగా ప్లాంటును పైకి నిర్మించారు. ఫలితంగా ఈటీపీ ప్లాంట్‌ నిర్మించిన నాటి నుంచి నిరుపయోగమే అయింది. దీంతో శాంతినగర్‌లో ఎస్‌టీపీ ప్లాంటును ఏర్పాటు చేశారు.

రూ.61.25 కోట్లతో ఎస్‌టీపీ ప్లాంటు

పట్టణంలో ప్రధాన మురికి కాల్వలు రెండు ఉన్నా యి. ఈ కాల్వల్లో వచ్చే మురికి నీటిని శుద్ధిచేసి మా నేరు వాగులోకి వదలిపెట్టే లక్ష్యంతో శాంతినగర్‌ డబుల్‌ బెడ్రూం ఇళ్ల కాలనీ వద్ద సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు (ఎస్‌టీపీ) ఏర్పాటు చేశారు. ఆరు ఎకరాల భూమిని కొనుగోలు చేసి రూ.61.25 కోట్లతో ఎస్‌టీపీని నిర్మించారు. 2022లో పనులు ప్రారంభించగా.. 90శాతం పూర్తి అయ్యాయి. మురికి నీటిని శుద్ధిచేసే యంత్రాలను బిగించాల్సి ఉంది. ఇవిపూర్తయితే మురికి నీటి శుద్ధి సాధ్యమవుతుంది.

బిల్లులు రాక.. పనులు పెండింగ్‌

ప్లాంటు నిర్మించిన కాంట్రాక్టర్‌కు రూ.30 కోట్ల మేరకు బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో బ్యాలెన్స్‌ పనులు చేయడం లేదు. ఫలితంగా ఎస్‌టీపీ ప్లాంటు వినియోగంలోకి రావడం లేదు. మురికి నీటితో భూగర్భ జలాలు కలుషితమవుతూనే ఉన్నాయి. ప్లాంటును పూర్తి చేయాలని కలెక్టర్‌, మున్సిపల్‌ ప్రత్యేక అధికారి సందీప్‌కుమార్‌ ఝా పలు మార్లు సమీక్షించారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు పూర్తి చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. భారీగా బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో ఎస్‌టీపీ పనులు పురోగతి సాధించడం లేదు.

సిరిసిల్ల మురుగు ‘శుద్ధి’ అయ్యేనా?

రూ.61.25 కోట్లతో ఎస్‌టీపీ ఏర్పాటు

బిల్లులు రాక మధ్యలో ఆగిన పనులు

పెండింగ్‌లో యంత్రాల బిగింపు

ఇది సిరిసిల్ల నడిబొడ్డున ప్రవహించే ప్రధాన మురికి కాలువ. ఒకప్పుడు ఇది మంచినీరు పారే ఉదారువాగు. సాయినగర్‌ మానేరువాగు నుంచి మంచినీరు ఈ కాలువలో ప్రవహిస్తే పట్టణవాసులు బిందెలతో తీసుకెళ్లి తాగేవారు. ఇది 50 ఏళ్ల కిందటి ముచ్చట. కాలక్రమంలో మురికినీటి కాలువగా మారింది. అంబేద్కర్‌నగర్‌ గుండా వెళ్లే ఈ కాలువలో పట్టణ మురికి అంతా ప్రవహిస్తోంది.

సిరిసిల్లలో వార్డులు: 39

పట్టణ జనాభా: 1.05 లక్షలు

విస్తీరణం: 55.47 చదరపు కిలోమీటర్లు

ప్రధాన మురికి కాల్వలు: 02

కుటుంబాల సంఖ్య: 33,608

ఇది సిరిసిల్ల పాత బస్టాండు, శాంతినగర్‌ గుండా ప్రవహించే కచ్ఛా మురికి కాలువ. పట్టణంలోని అద్దకం (డయింగ్‌) యూని ట్లలో వాడే రంగులు, రసాయనాలు, వ్యర్థ జలాలు ఈ కాల్వలో పారుతుంటాయి. వర్షాకాలంలో వరద పోటెత్తి చెరువులను దాటి మధ్యమానేరు వాగులో కలుస్తుంది.

పనులు పూర్తి చేయిస్తాం

సీవరేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంటు(ఎస్‌టీపీ) నిర్మాణ పనులు చాలా వరకు పూర్తి అయ్యాయి. కొన్ని పనులు చేయాల్సి ఉంది. కాంట్రాక్టర్‌తో మాట్లాడి పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటాం. ఎస్‌టీపీ పూర్తి అయితే సిరిసిల్ల మురికి నీటిని శుద్ధి సాధ్యమవుతుంది.

– వరుణ్‌, డీఈఈ, పబ్లిక్‌ హెల్త్‌, సిరిసిల్ల

శ్రద్ధ లేదు.. శుద్ధి కాదు!1
1/4

శ్రద్ధ లేదు.. శుద్ధి కాదు!

శ్రద్ధ లేదు.. శుద్ధి కాదు!2
2/4

శ్రద్ధ లేదు.. శుద్ధి కాదు!

శ్రద్ధ లేదు.. శుద్ధి కాదు!3
3/4

శ్రద్ధ లేదు.. శుద్ధి కాదు!

శ్రద్ధ లేదు.. శుద్ధి కాదు!4
4/4

శ్రద్ధ లేదు.. శుద్ధి కాదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement