
బ్యాంకు రుణాల్లో జిల్లాకు అవార్డు
● డీఆర్డీవో, సిబ్బందికి కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అభినందన
సిరిసిల్ల: స్వశక్తి సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంలో ఉత్తమ సేవలు అందించిన జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కలెక్టరేట్‌లో శుక్రవారం అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2024–25లో 7,969 సంఘాలకు రూ.533.73 కోట్లు లక్ష్యంకాగా రూ. 542.30 కోట్లతో 102శాతం ప్రగతి సాధించారని పేర్కొన్నారు. ఒక్కో గ్రూప్ ఫైనాన్స్ రూ.12.48 లక్షలు ఇవ్వడంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఉన్నారన్నారు. దీంతో రాష్ట్రస్థాయిలో జిల్లాకు అవార్డు వచ్చిందన్నారు. పీఆర్ మంత్రి సీతక్క, ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేశ్‌కుమార్, సీఈవో సెర్ప్ దివ్య దేవరాజన్ చేతుల మీదుగా డీఆర్‌డీవో, అదనపు డీఆర్‌డీవో, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు సరిత అవార్డు స్వీకరించారని తెలిపారు.
రివకరీలోనూ 99.74 శాతం
బ్యాంకు లింకేజీ రికవరీ 99.74 శాతంతో రాష్ట్రంలో జిల్లా రెండోస్థానంలో ఉందని, 2023–24 ఆర్ధిక సంవత్సరంలోనూ లక్ష్య సాధనలో భాగంగా బ్యాంకు లింకేజీ 106 శాతం సాధించారని కలెక్టర్ వెల్లడించారు. ఆర్థికంగా ప్రగతి సాధించి ఆయా కుటుంబాలు తమ పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి బ్యాంకు రుణాలు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఈ ఏడాది కూడా రాష్ట్రంలో జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు డిసెంబరులోగా లక్ష్యం సాధించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. డీఆర్‌డీవో శేషాద్రి, అదనపు డీఆర్‌డీవో గొట్టె శ్రీనివాస్ పాల్గొన్నారు.
సర్వేయర్ల శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
జిల్లాలో లైసెన్స్ సర్వేయర్ల శిక్షణకు ఆసక్తి గల అభ్యర్థులు మే 17వ తేదీలోగా దరఖాస్తులు చేయాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ఒక ప్రకటనలో కోరారు. లైసెన్స్ సర్వేయర్ల శిక్షణ కోసం అర్హత గల అభ్యర్థుల నుంచి తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్మెంట్ దరఖాస్తులు ఆహ్వానిస్తుందన్నారు. మే 5 నుంచి మీ సేవా కేంద్రాలలో రూ.100 చెల్లించి దరఖాస్తు నమోనాలను పొందవచ్చన్నారు. ఇంటర్‌లో గణితంలో 60శాతం మార్పులు సాధించిన వారు, ఐటీఐ డ్రాప్ట్స్‌మెన్(సివిల్) డిప్లమా, బీటెక్ (సివిల్) అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ఎంపికై న అభ్యర్థులకు 50 పని దినాలలో (మే 26 నుంచి జూలై 26 ) శిక్షణ ఇస్తామని, శిక్షణ కోసం ఓసీ అభ్యర్థులు రూ.10వేలు, బీసీలు రూ.5వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ.2500 ఫీజు చెల్లించాల్సి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఇతర వివరాలకు 98490 81489, 70326 34404, 94419 47339 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.