
రాష్ట్రంలో రాక్షస పాలన
● కేసీఆర్‌పై సీఎం వ్యాఖ్యలు శోచనీయం ● బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ● సిరిసిల్లలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
సిరిసిల్లటౌన్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రాక్షస పాలన సాగిస్తోందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ సిరిసిల్లలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను శుక్రవారం దహనం చేశారు. ఈ సందర్భంగా ఆగయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి అక్రమాలను, అరాచక పాలనను ఎండగడుతున్న జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడం హేయమైన చర్యగా విమర్శించారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేస్తున్నారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తే జగదీశ్‌రెడ్డిని సస్పెండ్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత రాష్ట్ర సమితి పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, టెక్స్‌టైల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గూడూరు ప్రవీణ్, నాయకులు బొల్లి రామ్మోహన్, గజభీంకార్ రాజన్న, పడిగల రాజు పాల్గొన్నారు.