గొల్లపల్లి పశువైద్యశాల ఎల్‌ఎస్‌వో సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

గొల్లపల్లి పశువైద్యశాల ఎల్‌ఎస్‌వో సస్పెన్షన్‌

Mar 7 2025 9:21 AM | Updated on Mar 7 2025 9:17 AM

సిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లి పశువైద్యశాలలో లైవ్‌స్టాక్‌ అధికారిగా పనిచేస్తున్న కె.కొమురయ్యను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా గురువారం ఆదేశాలు జారీ చేశారు. 2024 జనవరి 19న మెడికల్‌ ఇన్‌వాలిడేషన్‌ కోసం దరఖాస్తు చేసుకుని కరీంనగర్‌ సన్‌షైన్‌ హాస్పిటల్‌ పేరిట నకిలీ వైద్యసర్టిఫికెట్లు సృష్టించిన కొమురయ్యపై విచారణ చేపట్టి విధుల నుంచి తప్పించారు. 2017 నుంచి గొల్లపల్లి పశువైద్యశాలలో లైవ్‌స్టాక్‌ అధి కారిగా కొమురయ్య పనిచేయడం లేదు. లెటర్‌హెడ్‌, స్టాంప్స్‌, డాక్టర్‌ సంతకాలను సైతం ఫోర్జరీ చేసినట్లు విచారణలో తేలింది. నకిలీ వైద్యపత్రాలను సృష్టించిన కొమురయ్యపై ఎల్లారెడ్డిపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేయడంతోపాటు సస్పెండ్‌ చేసినట్లు కలెక్టర్‌ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

ఆది శ్రీనివాస్‌పై వ్యాఖ్యలు అర్థరహితం

● మహిళ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు వనిత

సిరిసిల్లటౌన్‌: ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌పై బీఆర్‌ఎస్‌ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు అర్థరహితమని మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత పేర్కొన్నారు. సిరిసిల్లలో గురువారం విలేకరులతో మాట్లాడారు. గతంలో వేములవాడ ఎమ్మెల్యే జర్మనీలో ఉండేవాడని ప్రజల కష్టసుఖాలను గాలికొదిలేశారన్నారు. కానీ ఆది శ్రీనివాస్‌ నిత్యం ప్రజల్లో ఉంటున్నారన్నారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ దగ్గరికి వెళ్లి ఎండిపోయిన కెనాల్‌ను చూపించి ఇది వేములవాడలోనే ఉందనడం శోచనీయమన్నారు. అధికారం పోయిందన్న బాధలో బీఆర్‌ఎస్‌ నేతలు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదని విమర్శించారు.

కార్మికులకు కనీస వేతనాలివ్వాలి

● సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ

సిరిసిల్లటౌన్‌: కార్మికులకు కనీస వేతనాలు అందించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరారు. ఈమేరకు గురువారం కలెక్టరేట్‌ ఏవోకు వినతిపత్రం అందించి మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేసిన కనీస వేతనాల జీవోల డ్రాఫ్టులను సవరించి, కనీస వేతనం రూ.26వేలు నిర్ణయించాలని డిమాండ్‌ చేశారు. ప్రతీ ఐదేళ్లకోసారి కనీస వేతనాలను సవరించాల్సి ఉండగా 12 ఏళ్లుగా పెంచడం లేదన్నారు. నాయకులు జిందం కమలాకర్‌, బెజుగం సురేష్‌, బత్తుల రమేశ్‌ పాల్గొన్నారు.

నీటి చౌర్యంపై చర్యలు తీసుకోవాలి

సిరిసిల్లటౌన్‌: చంద్రవంక ప్రాజెక్టులో అక్రమంగా మోటార్లు బిగించి జరుగుతున్న నీటిచౌర్యంపై చర్యలు తీసుకోవాలని ముదిరాజ్‌ కులస్తులు కోరారు. తంగళ్లపల్లి మండలం అంకుసాపూర్‌ ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్‌లో అధికారికి వినతిపత్రం అందజేసి మాట్లాడారు. గతంలోనే సెస్‌ అధికారులకు ఫిర్యాదు చేస్తే వారు మోటార్లు తొలగించారని, అయినా నీటిచౌర్యం ఆగడం లేదన్నారు. వెంటనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సంఘం ప్రతినిధులు కనకయ్య, అంజయ్య, లక్ష్మణ్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎల్‌ఎండీకి నీటి విడుదల

ఎల్‌ఎండీకి వెళ్తున్న నీరు

బోయినపల్లి(చొప్పదండి): మిడ్‌మానేరు ప్రాజెక్టు నుంచి ఎల్‌ఎండీకి నీటి విడుదల కొనసాగుతోంది. ఎల్‌ఎండీకి 2,500, కుడి కాలువకు 550, ప్యాకేజీ–9 మల్కపేటకు 350, ఎడమ కాలువకు 5 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేశారు. మిడ్‌మానేరు ప్రాజెక్టులో 14.87 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది.

గొల్లపల్లి పశువైద్యశాల   ఎల్‌ఎస్‌వో సస్పెన్షన్‌
1
1/3

గొల్లపల్లి పశువైద్యశాల ఎల్‌ఎస్‌వో సస్పెన్షన్‌

గొల్లపల్లి పశువైద్యశాల   ఎల్‌ఎస్‌వో సస్పెన్షన్‌
2
2/3

గొల్లపల్లి పశువైద్యశాల ఎల్‌ఎస్‌వో సస్పెన్షన్‌

గొల్లపల్లి పశువైద్యశాల   ఎల్‌ఎస్‌వో సస్పెన్షన్‌
3
3/3

గొల్లపల్లి పశువైద్యశాల ఎల్‌ఎస్‌వో సస్పెన్షన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement