
వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ అఖిల్ మహాజన్
● నలుగురి అరెస్ట్.. పరారీలో మరొకరు ● ఎస్పీ అఖిల్ మహాజన్
సిరిసిల్లక్రైం: గంజాయి మత్తుకు అలవాటు పడి అమ్మేందుకు ప్రయత్నించిన నలుగురిని సిరిసిల్ల పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. దాదాపు 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో శనివారం ఎస్పీ అఖిల్‌మహాజన్ వివరాలు వెల్లడించారు. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్‌కు చెందిన బట్ట రవీందర్, సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌కు చెందిన అంకర్ ప్రణీత్, ఈగ కృష్ణ, అంకర్ హశ్విత్‌ను అరెస్ట్ చేశామని, మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. సిరిసిల్లకు చెందిన ప్రణీత్, కృష్ణ, హశ్విత్ మత్తుకు అలవాటు పడి అవసరం ఉన్నప్పుడల్లా మాచారెడ్డి మండలం అక్కాపూర్‌కు చెందిన రవీందర్ నుంచి గంజాయి కొనుగోలు చేసేవారని వివరించారు. వ్యాపారంగా మార్చుకుంటే ఎక్కువ డబ్బులు సంపాధించవచ్చన్న ఆలోచనతో రూ.30వేలు రవీందర్‌కు ఇచ్చి.. గంజాయి తెచ్చుకునేందుకు ఒప్పందం చేసుకున్నారని వివరించారు. దీనిలో భాగంగా శనివారం మధ్యాహ్నం సిరిసిల్ల శివారులోని మానేరువాగు ఒడ్డున గల మున్నూరుకాపు సంగ భవనం వద్దకు రవీందర్ రాగానే సిరిసిల్లకు చెందిన ముగ్గురు యువకులు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న సిరిసిల్ల టాస్క్‌ఫోర్స్, సిరిసిల్ల టౌన్ పోలీసులు అక్కడికి చేరుకొని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 18 కిలోల గంజాయి, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. వీరిని పట్టుకున్న జిల్లా టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ కట్ల రవీందర్, ఎస్సై రవీందర్‌నాయుడు, హెడ్‌కానిస్టేబుల్ తిరుపతి, కానిస్టేబుళ్లు అక్షర్, మహిపాల్, శ్రీనివాస్,ి సిసరిసిల్ల టౌన్ సిబ్బందిని అభినందించారు.
మేము చేయలేము.. నిందితుల రోదన
గంజాయి నిందితులను మీడియా ముందుకు తీసుకొస్తుండగా.. తాము గంజాయి కొనుగోలు, అమ్మకాలు చేయలేదని అక్కడ ఉన్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. గంజాయి తాగే అలవాటు ఉండేదన్నారు. గతంలో ఉన్న సమాచారంతో పోలీసులు తమను పట్టుకుని అక్రమ కేసులు బనాయించారని రోదించారు. దీన్ని గమనించిన పోలీసులు వారిని వెంటనే అక్కడి నుంచి పరిపాలన గదిలోకి తీసుకెళ్లారు.