హనుమంతునిపాడు ఎస్సై రాజ్‌కుమార్ దాష్టీకం ఎస్సీలపై విచక్షణారహితంగా దాడి బుధవారం అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి బాధితుల నిరసన ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ ఎస్పీ, డీఎస్పీ, సీఐలకు ఫిర్యాదు బాధితులకు మద్దతు ప్రకటించి గురువారం ఆందోళనలో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నాయకులు ఎస్సైపై చర్యలు తీసుకోవాలన్నపార్టీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి దద్దాల నారాయణయాదవ్
లింగంగుంట్ల ఎస్సీకాలనీకి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై హెచ్‌ఎం పాడు ఎస్సై రాజ్‌కుమార్ అకారణంగా దాడి చేశారు. మహిళలని కూడా చూడకుండా కులం పేరుతో దూషించి కొట్టారు. కనిగిరిలో పోలీస్ రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఇటీవల అనేక ఘటనల్లో పోలీసులు అత్యుత్సాహం చూపించారు. ఇది సరైంది కాదు. హెచ్‌ఎం పాడు ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు తక్షణం స్పందించి ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బాధితులకు న్యాయం చేయాలి. బాధితులకు న్యాయం జరిగేంత వరకు వైఎస్సార్ సీపీ అండగా ఉండి పోరాడుతుంది.
– డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్, వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి
నేను ఊరికిపోయి వస్తున్నా. మా కాలనీ దగ్గర కేకలు వినిపించాయి. నేను అక్కడికి వెళ్లాను. అక్కడ నా కుమారుడిని ఎస్సై రాజ్‌కుమార్ లాఠీతో కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారని అడిగినందుకు నన్ను కూడా అసభ్య పదజాలంతో ఎస్సై దూషించారు. సార్.. నేను మీ అమ్మలాంటి దాన్ని నన్ను ఎందుకు తిడుతున్నారని దండం పెట్టినా వినకుండా కొట్టారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలి.
– కొదమల దేవమ్మ, బాధితురాలు
కనిగిరి రూరల్/హనుమంతునిపాడు: కనిగిరి నియోజకవర్గంలో పోలీసులు రెడ్‌బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. రౌడీయిజం ప్రదర్శిస్తూ రోజురోజుకూ పేట్రేగిపోతున్నారు. ఇటీవల జరుగుతున్న వరుస ఘటనలు అందుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుండగా, తాజాగా బుధవారం రాత్రి హనుమంతునిపాడు ఎస్సై టి.రాజ్‌కుమార్ విచక్షణారహితంగా ఎస్సీలపై దాడి చేయడంతో బాధితులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మండలంలోని లింగంగుంట్ల గ్రామస్తులు, ఎస్సీకాలనీకి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలను ఎస్సై రాజ్‌కుమార్ విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా అసభ్యకర పదజాలంతో దూషించడంతో కనిగిరిలోని సీఐ కార్యాలయం, హనుమంతునిపాడు పోలీస్‌స్టేషన్ల వద్ద బైఠాయించి బాధితులు ధర్నా చేశారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. లింగంగుంట్ల గ్రామ పరిధిలోని వైఎస్సార్ సీపీ బీసీ సెల్ మండల అధ్యక్షుడు మద్ది తిరుపతయ్య పొలం వద్ద ఎస్సీకాలనీకి చెందిన వైఎస్సార్ సీపీ కార్యకర్తలు మిత్తి తిరుపతయ్య, కోలా మత్తయ్య, కొదమల మోజేష్, కొదమల జపన్య, బంగారు బ్రహ్మయ్య, కోలా యేసు బుధవారం రాత్రి 7 గంటల సమయంలో మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో నారాయపల్లి నుంచి వచ్చిన ఎస్సై టీ రాజ్‌కుమార్ పోలీసు వాహనం ఆపి అకారణంగా లాఠీతో వారిపై దాడి చేశారు. విచక్షణా రహితంగా కొట్టడంతో.. ఎందుకు కొడుతున్నారో చెప్పండని బాధితులు నిలదీశారు. కానీ, మరింత రెచ్చిపోయిన ఎస్సై రాజ్‌కుమార్.. మహిళలని కూడా చూడకుండా అసభ్య పదజాలంతో దూషిస్తూ లాఠీతో తీవ్రంగా కొట్టి గాయపరిచినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పైగా, అక్కడున్న వాహనాలు ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురిచేస్తూ ఎస్సై వీరంగం చేశారని బాధితులు ఆరోపించారు. ఎస్సీకాలనీకి చెందిన తమను మాదిగ కొడకల్లారా.. అని కులం పేరుతో దూషిస్తూ తీవ్ర భయాందోళనకు గురిచేశారని తెలిపారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన ఎస్సై.. తమను దౌర్జన్యంగా, అకారణంగా దూషించి కొట్టారని ఆరోపించారు. తమకు ఎస్సై నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ బాధితులు, వారి బంధువులు బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. కనిగిరిలోని సీఐ కార్యాలయం వద్దకు నిరసన తెలుపుతున్న విషయాన్ని తెలుసుకున్న సీఐ ఉప్పు శ్రీనివాసులు అక్కడికి చేరుకుని తాను న్యాయం చేస్తానంటూ సర్దిచెప్పి పంపించారు.
పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్సార్ సీపీ శ్రేణుల నిరసన...
ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారిని ఎస్సై రాజ్‌కుమార్ అకారణంగా కొట్టి కులం పేరుతో దూషించడాన్ని నిరసిస్తూ గురువారం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు గురువారం ఎస్సీ కాలనీ వాసులతో కలిసి కనిగిరిలోని హెచ్‌ఎం పాడు పోలీస్ స్టేషన్ వద్ద శాంతియుత నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ తాము చేసిన తప్పేంటో చెప్పాలని, ఎవరి ప్రోద్భలంతో తమపై ఎస్సై దాడి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. అకారణంగా కులం పేరుతో తమను దూషించి లాఠీతో దాడి చేసి కొట్టిన ఎస్సైపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సై రాజ్‌కుమార్ నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. నిరసనకారులతో సీఐ ఉప్పు శ్రీనివాసులు మాట్లాడుతూ రెండ్రోజుల్లో విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేస్తూ వినతిపత్రం అందజేసినట్లు బాధితులు, వైఎస్సార్ సీపీ నాయకులు తెలిపారు. నిరసన కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు యక్కంటి శ్రీనివాసులరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి గాండ్లపర్తి ఆదినారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ మద్ది నాగరత్తాలు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు మద్ది తిరుపతయ్య, గుంటక రమణారెడ్డి, భవనం కృష్ణారెడ్డి, సానికొమ్ము మధుసూదన్‌రెడ్డి, కేతి బోయిన వెంకట కాశయ్య, కోలా మత్తయ్య, ఆవుల రాజు, కొదమల కిషోర్, కేతిరెడ్డి బాలకొండారెడ్డి, కేతిరెడ్డి బాలవెంకటయ్య, బంగారు బ్రహ్మయ్య, నక్కినేని చెన్నయ్య, ఎం.కేశవులు, నల్లగాటి రమణ, కాశయ్య, కాకినేని కృష్ణ, వెలుగొండయ్య తదితరులు పాల్గొన్నారు.


